Kakatiya Kala Thoranam | వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయుల కళాతోరణం.. చెరువు, పట్టణం, ఆలయం స్ఫూర్తితో ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తి చిహ్నం. కళాతోరణం అంటే రాతి కట్టడమేనని అనుకుంటున్నారు సర్కారు పెద్దలు. అధికార బలంతో ఎదురులేదని విర్రవీగిన ఢిల్లీ పాలకులను ఎదిరించి నిలిచిన తెలంగాణ వీరత్వానికి గుర్తు కళాతోరణం. ఢిల్లీ సుల్తానుల దండయాత్రను ఎదురొడ్డి పోరాడిన సామాన్య ప్రజల విజయగాథలకు చిహ్నంగా కళాతోరణం నిలిచింది. తెలంగాణ ప్రజల సంస్కృతి, వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన కాకతీయ కళాతోరణాన్ని ఢిల్లీ పెత్తనంలో రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా రాజముద్ర నుంచి తొలగిస్తున్నది. 700 ఏండ్ల కిందట ఢిల్లీ సుల్తానుల దండయాత్రను ఎదురించిన స్ఫూర్తితోనే ఇప్పుడు కళాతోరణాన్ని పరిరక్షించుకొనే తరుణం వచ్చింది.
అప్పటి స్ఫూర్తితో..
ఢిల్లీ సుల్తాను జలాలుద్దీన్ ఖిల్జీ అధికార కాంక్షతో దక్షిణ భారతదేశంపై దండయాత్రలు మొదలుపెట్టారు. ఆయన సేనలు 1295లో యాదవ రాజ్యకేంద్రమైన దేవగిరిని దోచుకొనిపోయారు. అనంతరం జలాలుద్దీన్ను హత్యచేసి సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంపై దాడులను తీవ్రం చేశాడు. దేవగిరి రాజు యాదవచంద్రుడు మొదటి యుద్ధంలోనే ఖిల్జీతో సంధి చేసుకున్నాడు. ఈ విజయంతో మాలిక్ ఫక్రుద్దీన్, జునాఖాన్ నాయకత్వంలో ఖిల్జీ సేనలు దక్షిణ భారతదేశంలోనే సంపన్నమైన కాకతీయ రాజ్యంపై 1303లో ఓరుగల్లు వైపు దండయాత్రకు వచ్చాయి. కాకతీయ సేనానులు పోతుగంటి మైలి, రేచర్ల వెన్న భూపాలుడు నాయకత్వంలో కాకతీయ సైనికులు ఢిల్లీ సుల్తానుల సైన్యాన్ని అడ్డుకున్నారు. వీరోచితంగా పోరాడి ఖిల్జీ సేనలను వెనక్కి తరిమారు. ప్రస్తుత కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి, సైదాపూర్ మండలం గొడిశాల నుంచి ఖిల్జీ సేనలు ఓటమితో తిరుగుముఖం పట్టాయి. ప్రజల అండదండలతో ఢిల్లీ సుల్తానులపై కాకతీయ సేనలు చేసిన ఈ యుద్ధం గురించి గొడిశాలలో కాకతీయుల కళాతోరణం ఉన్నది.
పక్కదారి పట్టించే పనులు
కాకతీయ శిల్పుల కీర్తి కిరీటంలో కళాతోరణం ఒక కలికితురాయి. దానిపై కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. ఎలాంటి సాంకేతిక, యంత్ర పరికరాలు లేకుండా వం దల ఏండ్ల కింద చెక్కిన తోరణాలు గొప్ప వారసత్వ సంపద. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓరుగల్లు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, అస్థిత్వ చిహ్నంగా ఉన్న కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ సర్కా రు సాంస్కృతిక, వారసత్వ సంపదపై దాడిగానే చూస్తామని స్పష్టం చేస్తున్నా రు. చరిత్రలో రాజధానులు, వాటి పేర్లు, నాణేలను మార్చిన రాజులు ఇప్పటికీ చరిత్రహీనులుగానే ఉన్నారని, కాంగ్రెస్ సర్కారు చర్యలు అదే కోవలోకి వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ చారిత్రక వారసత్వం, సంస్కృతిపై దాడి
కాంగ్రెస్ సర్కారు చర్యలు తెలంగాణ చారిత్రక వారసత్వం, సంస్కృతిపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ రాజముద్రలో పెట్టుకున్న కాకతీయ కళాతోరణం ప్రజలు కేంద్రంగా సాగిన పాలనకు గుర్తింపు. ఇలాంటి స్ఫూర్తి కలిగిన కాకతీయ కళాతోరణాన్ని ఢిల్లీ చెప్పుచేతుల్లో ఉండే రేవంత్ సర్కారు తొలగిస్తున్నది. ఇప్పుడు ఆ సర్కారుపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ సమాజం గొంతెత్తుతున్నది. కళాతోరణాన్ని తొలగించే నిర్ణయం ఎంతమాత్రం అంగీకారం కాదని యావత్తు తెలంగాణ ప్రజలు, మేధావులు, చరిత్రకారులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రజల మనసు ఎరుగని కాంగ్రెస్ సర్కారు మొం డిగా ముందుకుపోతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కవులు, కళాకారులు, విద్యార్థులు, పరిశోధకులు, మహిళలు ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు.
కళాతోరణం
తీసేయడం సరికాదు
రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం. ఒకప్పుడు వరంగల్ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన సాగించిన కాకతీయలకు గుర్తింపుగా కళాతోరణం నిలిచింది. కాకతీయుల పాలనావైభవాన్ని చాటిచెప్పే చిహ్నం. అంతేకాక సుమారు 200 ఏండ్లు పాలించిన కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, చారిత్రక కట్టడాలు, దేవాలయాల ఘన చరిత్ర, పాలన వైభవం అంతా కళాతోరణంలో పూసగుచ్చినట్టుగా ఉన్నది. ఓరుగల్లు చారిత్రక ప్రాధాన్యానికి కళాతోరణం చిహ్నంగా నిలిచింది. కళాతోరణం తొలగింపుతో ఓరుగల్లుకు ఉన్న గొప్ప చారిత్రిక గుర్తింపు మాయం కావడంతోపాటు ప్రాధాన్యం తగ్గుతుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించి ఏమి పెడతారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎప్పడూ ప్రజల ఆమోదయోగ్యంగానే ఉండాలి.
– అంపశయ్య నవీన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
రాచరికమని చరిత్రనే తిరగరాస్తారా..?
తెలంగాణ రాజముద్రలో రాజవంశాల గుర్తులని, కాకతీయ తోరణ ద్వారాన్ని, చార్మినార్‌ను తొలగించడం అనుచితం. వాటిమీద ఆయా రాజవంశాల చిహ్నాలేమీ ఉండవు. కానీ, ఆనాటి శిల్పశైలి ఉంటుంది. అదొక సాంస్కృతిక పరంపర. కాకతీయుల చెరువులు గొప్పవే. రామప్ప గొప్పదే. రాణీరుద్రమ గొప్పదే. అయితే రాచరికమని చరిత్రనే తిరగరాస్తా రా..? చార్మినార్ రాజవంశానిది కాదు. మతచిహ్నం కాదు. అదొక సాంస్కృతిక నమూనా. వీటికన్నా గొప్పగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యమ్నాయ చిహ్నాలు ఏమున్నాయో మరి. వీటికి కలిగిన ప్రాచుర్యం వల్ల తెలంగాణ ప్రజలు వాటిని తమ సొంతం చేసుకున్నారు. వీటిని తొలగించి వేటిని చేరుస్తారు? ఏ రాజవంశాలకు చెందని రాతి చిత్రాలనా? వీరగల్లులనా..? క్రీడలనా..పక్షులనా…? తెలంగాణ సాయుధ పోరాట యోధులనా? తెలంగాణ ఉద్యమకారుల ఫొటోలనా? ఎవరివని? ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఇష్టాపూర్తిగా రాజముద్రలంటే అవి కూడా రాజరికపు చిహ్నాలుగానే మిగిలిపోవా? కొత్త రాజముద్ర ఎట్ల ఉండబోతుందనే కుతూహలం ప్రజల్లో పెరిగిపోయింది. అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా లేకపోతే ఏం చేస్తారు రూపకర్తలు. ప్రజలకు న చ్చేవి చేస్తేనే ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుంది. ప్రస్తుతమున్న రాజముద్రలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పడం సరికాదు. ఇప్పుడున్న లోగోలో కాకతీయ కళాతోరణం అద్భుతంగా కనిపిస్తున్నది. దీని ద్వారా కాకతీయ రాజులు తమ రాజ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వ్యవసాయరంగ అభివృద్ధి కోసం విస్తృతంగా తవ్వించిన చెరువుల చరిత్ర భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి దోహదపడుతుంది. అటు రాచరికపు వ్యవస్థలోనూ ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ తప్పొప్పులు జరుగుతూనే ఉంటాయి. మంచిని స్వీకరించి రాబో యే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి.
-శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్
ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించడమే..
అనేక పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం మన తెలంగాణ. తొలి సీఎంగా కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు చేపట్టారు. బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను రాష్ట్ర పండుగలుగా, జమ్మిచెట్టును రా ష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా గుర్తించారు. తెలంగాణ రాజముద్రను రూపొందించారు. కాకతీయుల కళాతోరణం, చార్మినార్ వంటి అంశాల మేళవింపుగా అంతర్జాతీయ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ రూపొందించిన లోగోను తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా నిర్ణయించారు. ప్రస్తుత సీఎం ఉన్న రేవంత్‌రెడ్డి టీఎస్‌ను టీజీగా మార్చ డం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయడం వంటివి ప్రజ ల్లో కొంత అసహనాన్ని, అశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి.
– అంబటి వెంకన్న, ప్రముఖ గాయకుడు, నల్లగొండ
చరిత్రను కాలరాయడం ఎవరితరమూ కాదు
అలనాటి కీర్తి తోరణాలు, శాసనాలు, ప్రాచీన కట్టడాలు మన సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. రాష్ట్ర గీతం నుంచి కళాతోరణాన్ని తొలగించవచ్చేమో కానీ తెలంగాణ ప్రజల హృదయం నుంచి తీసివేయలేము. మన చా రిత్రక వారసత్వ సంపదను కాపాడడం, భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత. ఈ విషయంలో తొందరపడక ఒకసారి పునఃఆలోచించడం శ్రేయస్కరం. చరిత్రను కాలరాయడం ఎవరి తరమూ కాదు.
-టంగుటూరి సైదులు, సాహిత్య పరిశోధకుడు, చందుపట్ల, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా
ప్రాంతీయులకే ప్రాధాన్యమివ్వాలి..
తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేక చరిత్ర, సందర్భమూ ఉన్నది. ఆంధ్రా పెత్తందారుల నుంచి విముక్తి కోసమే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ‘జయ జయహే తెలంగాణ’ పాటకు ఓ ప్రత్యేక స్థానం ఉన్నది. ఉద్యమ సమయంలో ఎందరిలోనో స్ఫూర్తి నింపింది. తెలంగాణ అధికార చిహ్నంలో చార్మినార్, కాకతీయు కళాతోరణం తొలగించడం సముచితం కాదు.
– జక్కెపల్లి నాగేశ్వర్రావు, సంగీత విద్వాంసుడు, చెన్నూర్, మంచిర్యాల జిల్లా