హనుమకొండ చౌరస్తా, జూలై 10: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు వచ్చింది. బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నిర్దేశించిన సెవెన్ పాయింట్ సేల్‌లో 3.27 సోర్ను కేయూ సాధించింది. న్యాక్ ఏ+ గ్రేడ్ సర్టిఫికెట్ త్వరలో వర్సిటీ అం దుకోనున్నది. ఈ గుర్తింపు ద్వారా జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వర్సిటీకి విరివిగా నిధులు అందుతాయి. నూతన ప్రాజెక్టులు పొందడానికి వెసులుబాటు కలుగుతుంది. విదేశీ సంస్థలతో ఒప్పందాలు, ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడికి, పెద్దఎత్తున అకడమిక్, రిసెర్చ్‌కు అవకాశం ఉంటుంది.
వర్సిటీ బలాలు, బలహీనతలు, అవకాశాలు, అవరోధాలు అంచనాలు వేసుకొని నిరంతర మూల్యంకనానికి చాన్స్ ఏర్పడుతుంది. ది బెస్ట్ ప్రాక్టీసెస్, నాణ్యమైన విద్య అందించడం, కొత్త కోర్సులు, టీచింగ్, లెర్నిం గ్, నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి, క్యాంపస్ సెలక్షన్ ద్వారా విద్యార్థులు మంచి ప్యాకేజీ పొందేందుకు అవకాశం కలుగుతుంది. కేయూ దూరవిద్య కేంద్ర చరిత్రలో తొలిసారిగా క్యాటగిరీ-1 కింద చట్టబద్ధ సంస్థల నుంచి స్వయం ప్రతిపత్తి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. దూరవిద్య కేంద్రం ఇక నుంచి నేరుగా యూజీసీ-డీఈబీ నుంచి నూతన కోర్సుల ఆమోదం పొందవచ్చు.
కేయూకు బంగారు భవిష్యత్: వీసీ రమేశ్
డీన్లు, విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు, పరిపాలనా అధికారులు, బోధనేతర సిబ్బంది సమిష్టి కృషి వల్లే వర్సిటీకి న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు లభించిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాడికొండ రమేశ్ చెప్పారు. కేయూకు ఏ ప్లస్ గ్రేడ్ వచ్చిన సందర్భంగా సోమవారం ఆయన వర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో మీడియాతో మాట్లాడారు. కేయూకు బంగారు భవిష్యత్ ఉన్నదని, ఆ దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఉన్నత విద్యామండలి అధికారులు నవీన్‌మిట్టల్, వాకాటి కరుణ, పాలకమండలి సభ్యులకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియలో ఎంతో శ్రమకోర్చిన అకడమిక్ అడ్వైజర్, ఐక్యూఏసీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.