హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం కేంద్రంగా మొదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తుఫాన్ ఒడిశాను తాకింది. బుధవారం బీఆర్ఎస్ తొలి బహిరంగసభ సూపర్‌హిట్ అయిన మరుసటిరోజే ఒడిశా కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. ఒడిశా మాజీ సీఎం, 9 సార్లు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించిన గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్ గమాంగ్ సీఎం కేసీఆర్‌తో దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన కొద్దికాలానికే ఆ రాష్ర్టానికి చెందిన సీనియర్‌నేత, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యదర్శి కైలాశ్‌కుమార్ ముఖి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశాన్ని నడిపించే రాజనీతిజ్ఞత, సామర్థ్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఉన్నాయని తన రాజీనామా లేఖలో తెలిపారు. తెలంగాణ మాడల్ దేశంలోని అనేక రాష్ర్టాల కళ్లు తెరిపించిందని కైలాశ్‌కుమార్ పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం.. ప్రత్యేకించి తన సొంత జిల్లా కంధమాల్ ప్రగతి కోసమే తాను కేసీఆర్‌తో పనిచేయాలని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు.
భారతదేశాన్ని ప్రగతిశీల దేశంగా మార్చగలిగే సత్తా, సామర్థ్యం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మాత్రమే ఉన్నాయని కైలాశ్ స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడితో కలిసి పనిచేసేందుకే తాను కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అతికొద్ది కాలంలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారని ప్రశంసించారు.
దళిత జనాభ్యుదయానికి దేశంలో ఇప్పటి వరకూ ఏ నాయకుడు చేయని ఆలోచన సీఎం కేసీఆర్ చేశారని, ఆలోచన వరకే పరిమితం కాకుండా దళితబంధు అనే పథకాన్ని అమలు చేసి చూపిస్తున్నారని కైలాశ్‌కుమార్ ముఖి పేర్కొన్నారు. దళితులను వ్యాపారులుగా తీర్చిదిద్ది వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు ప్రసాదించే దళితబంధు పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న కేసీఆర్ నిజమైన ‘దళితబంధు’వు అని కైలాశ్ కీర్తించారు. దళితబంధు తనకు నచ్చడం వల్లే కేసీఆర్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకొన్నట్టు చెప్పారు.