న్యూఢిల్లీ: భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్యానికి బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మెగా ఈవెంట్లో దేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు 5 నుంచి 15 ఏండ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రకటించారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ‘ప్రపంచ క్రీడారంగంలో భారత్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, స్పోర్ట్స్ మెడిసిన్.. ఇలా ప్రతి విభాగంలోనూ దేశం వేగంగా ముందుకు సాగుతోంది. ఒలింపిక్స్లో దాదాపు 40 రకాల క్రీడల్లో 350 ఈవెంట్లు ఉంటాయి. అయితే కనీసం అర్హత సాధించలేకపోవడం వల్ల మనం మూడింట రెండు వంతుల ఈవెంట్లలో పోటీ పడలేకపోతుండటం విచారకరం. అందుకే 2036 ఒలింపిక్స్ నాటికి కనీసం 75 శాతం ఈవెంట్లలో భారత్ ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించాం. ఇందుకోసం 5 నుంచి 15 ఏండ్ల పిల్లల్లో ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణతో వరల్డ్ క్లాస్ అథ్లెట్లుగా మారుస్తాం’ అని ప్రకటించారు.