ముంబై: క్రీడల్లో రాణించి డబ్బు సంపాదించడం అంత సులభం కాదని భారత దిగ్గజ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. వరల్డ్ టాప్20 ర్యాంకుల్లో నిలిస్తే తప్ప మంచి స్పాన్సర్‌షిప్‌లు, ఆర్థిక సాయం లభించడం లేదని శనివారం జరిగిన ఈ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న నెహ్వాల్ చెప్పింది. ఫలితాలు ఆలస్యంగా వచ్చినా తట్టుకుని నిలబడాలంటే చిన్న వయసు నుంచే అథ్లెట్లకు ప్రమోషన్లు, మార్కెటింగ్, స్పాన్సర్‌షిప్‌లు అందజేసే వ్యవస్థ రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక, ఒలింపిక్స్, పెద్ద అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యమివ్వడం మాత్రమే సరిపోదని, పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినప్పుడే భారత్‌ను నిజమైన కీడా దేశమని పిలవగలమని చెప్పింది. ‘గత 20 ఏండ్లలో దేశంలో క్రీడల పరిస్థితి, ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం బాగా పెరిగింది. హర్యానాకు చెందిన అనేక మంది అమ్మాయిలు రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ తరహా మార్పు దేశవ్యాప్తంగా రావాలి. అప్పుడే భవిష్యత్తులో భారత్‌ను క్రీడా దేశంగా చెప్పుకోగలం’ అని అభిప్రాయపడింది. ఇక, క్రికెట్లో ఉన్నట్లుగా మిగతా క్రీడల్లోనూ జీతాల వ్యవస్థ, ఆర్థిక భద్రత లభిస్తే అథ్లెట్లు క్రీడలను ఒక వృత్తిగా ఎంచుకుంటారని సైనా చెప్పుకొచ్చింది.