వరంగల్, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌కు, తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చకు రావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తొమ్మిదేండ్లుగా తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు, నేతలు తెలంగాణ ప్రయోజనాలు పట్టని దద్దమ్మలు, చవటలు అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత పార్టీలని, మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సోమవారం హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగసభ తెలంగాణ ప్రజలను మోసం చేసేలా, అవమానించేలా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో రూ.800 పింఛన్ ఇస్తూ.. తెలంగాణలో మాత్రం రూ.4వేలు ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చిందని దుయ్యబట్టారు. అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి అవినీతిని పరిచయం చేసిందే ఆ పార్టీ అని విమర్శించారు.
రాష్ట్రంలో వారికి సింగిల్ డిజిట్ సీట్లు రావు
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ సీట్లు రావని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. దగుల్బాజీ మాటలు మాట్లాడే, అవగాహన లేని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం ఆ పార్టీ దౌర్భాగ్యం అని విమర్శించారు. ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేండ్ల క్రితమే గిరిజన యూనివర్సిటీ మొదలయిందని, తెలంగాణలో ఇప్పటికీ ఎందుకు మొదలుకాదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం 2019 జనవరిలోనే గిరిజన యూనివర్సిటీకి ములుగులో 335 ఎకరాల భూమిని బదలాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని చెప్పిన కేంద్రం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు మంజూరు చేసి తెలంగాణకు మోసం చేసిందని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు నలభై ఏండ్లుగా పోరాడుతున్నా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేది లేదని చెప్పిన కేంద్రం.. కర్ణాటక ఎన్నికలకు ముందు అప్పర్ భద్ర, మధ్యప్రదేశ్‌లోని కెన్బెట్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలు జరిపిన పోరాటంతో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఏ టీం బీఆర్ఎస్ ఒక్కటేనని, సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
8లోపు కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టంగా చెప్పాలి: దాస్యం వినయ్‌భాస్కర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్ నగరానికి వస్తున్నారని, ఆ లోపే కాజిపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. 40 ఏండ్ల ఆకాంక్ష అయిన కోచ్ ఫ్యాక్టరీపై అప్పుడు కాంగ్రెస్, తొమ్మిదేండ్లుగా బీజేపీ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పుట్టి, అవినీతిలో పెరిగిందని, ఆ పార్టీ నేతలు అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు.