PM Modi : పరీక్షలు పండుగల లాంటివని, వాటిని భారంగా భావించవద్దని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. కేవలం మార్కులపైన మాత్రమే దృష్టిపెట్టి చదవద్దని, జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కోసం చదవాలని సూచించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో బోర్డు పరీక్షలకు ముందు ప్రధాని మోదీ వారితో ఇంటరాక్ట్ అయ్యారు. ‘పరీక్షా పే చర్చ (Parikha pe Charcha)’ 9వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడారు.
కంఫర్ట్‌గా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదని విద్యార్థులకు ప్రధాని సూచించారు. కంఫర్ట్ జోన్స్ జీవితాన్ని తీర్చిదిద్దలేవని చెప్పారు. అందరి సలహాలు తీసుకోవాలని, కానీ మీకు నచ్చిన విధంగా మీ జీవన విధానాన్ని మలుచుకోవాలని ప్రధాని సూచించారు. ముక్కలు ముక్కలుగా చదివే చదువు విజయాన్ని అందించదని ప్రధాని చెప్పారు. మీ పేరెంట్స్, టీచర్స్, తోటి విద్యార్థులు ఏమంటున్నారనేది విషయం కాదని, వారి సూచనలు మనుసులో పెట్టుకుని మీకు నచ్చిన దారిలో నడవాలని అన్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీలోని తన నివాసానికి వచ్చిన విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. గత ఏడాది అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో ఒక్కరి పేరైనా మీకు గుర్తుందా..? అని ఈ సందర్భంగా ప్రధాని ప్రశ్నించారు. అందుకు విద్యార్థులు బదులిస్తూ ‘లేదు’ అనే సమాధానం ఇచ్చారు. మళ్లీ ప్రధాని స్పందిస్తూ.. ‘మార్కులకు ఉన్న ప్రాధాన్యం అంతే.. అప్పటికప్పుడు బాగా పొగుడుతారు. ఆ తర్వాత కొద్దికాలానికే మర్చిపోతారు. కాబట్టి మార్కుల కోణంలో కాకుండా జీవితాన్ని మెరుగుపర్చుకునే కోణంలో విద్యాభ్యాసం చేయాలి’ అని సూచించారు.