హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌కు నంబర్‌ను కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కొందరు ప్రజాప్రతినిధులు కాలరాశారని పాల్ వాదించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున గెలిచిన కొద్ది రోజులకే కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఇలాంటివారిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా నిరోధించాలని, ఫిరాయింపుదారులకు సౌకర్యాలన్నీ రద్దు చేయాలని కోరారు. దీంతో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లు సింగిల్ జడ్జి వద్ద ఉన్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. దీనిపై పాల్ స్పందిస్తూ.. అవన్నీ రాజకీయ ప్రయోజనాలతో కూడిన పిటిషన్లని తెలిపారు. తాము ప్రజాప్రయోజనాల కోసం పిల్ వేశామని, ఆ మేరకు అఫిడవిట్ వేస్తామని చెప్పారు. దీంతో విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
లడ్డూ ప్రసాదం అసత్య వార్తలపై టీటీడీ ఖండన
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూలను భక్తులకు కేవలం రెండు మాత్రమే ఇస్తున్నారని, అదనంగా కావాలంటే ఆధార్ తప్పనిసరని, ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ అవకాశం ఉంటుందని ఏఈవో వెంకయ్యచౌదరి పేరుతో ఓ వార్త ప్రచారం జరిగింది. దీనిపై వివరణ ఇచ్చిన టీటీడీ.. లడ్డూ విక్రయ విధానాల్లో మార్పు లేదని, దర్శనం తర్వాత భక్తులకు ఉచిత లడ్డూతోపాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తున్నట్టు చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. నెలకోసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని, అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది. గురువారం శ్రీవారికి రూ.4.51కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చెన్నైకి చెందిన టీవీఎస్ మోటర్స్ ఎండీ వేణుసుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 బైకులను విరాళంగా అందజేసినట్టు చెప్పారు.