హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పేదవాడికో న్యాయం, పెద్దలకో న్యా యం అన్నట్టుగా హైడ్రా చర్యలు ఉన్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆరోపించారు. పేదల ఇండ్ల కూల్చివేతల విషయంలో నోటీసులు కూడా ఇవ్వడం లేదని, అదే సీఎం సోదరుడికి నోటీసు ఇచ్చారేగానీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. హైడ్రా కూల్చివేతలను సవాలుచేస్తూ కేఏ పాల్ చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ, చెరువుల రక్షణకు చేపట్టిన చర్యలను నిబంధనల ప్రకారం అమలు చేయడంలేదని చెప్పారు. పేదల నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా సంపన్నుల విషయంలో ఉదాసీనంగా ఉన్నదని తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఇల్లే నిదర్శనమని చెప్పారు. హైడ్రా వివక్షతో వ్యవహరిస్తున్నదని అంటూ సీఎం సోదరుడి ఇంటి విషయంలో హైడ్రా 32 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినా చర్యలు చేపట్టకపోవడం అందుకు ప్రధాన ఉదాహరణ అని తెలిపారు. తన పిల్‌పై విచారణ ముగిసే వరకు ఏవిధమైన కూల్చివేత చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ వాదనలు వినకుండా స్టే ఆదేశాలు జారీ చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, ప్రభుత్వ స్పందన చూశాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేరొంది. ప్రతివాదులైన మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైడ్రాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.