హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ .. ఫూలే ఆశయాలను తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ కొనసాగించారని పేర్కొన్నారు. ఫూలే అన్ని వర్గాల హక్కుల కోసం కొట్లాడారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. ఫూలేకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఫూలే ఆశయసాధన కోసమే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు బీసీ బంధు పెట్టారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య పేర్కొన్నారు. ఫూలే ఆశయాలకు సీఎం రేవంత్‌రెడ్డి తూట్లు పొడిచారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు సుమిత్రా ఆనంద్, ఉపేంద్ర, కిశోర్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్, విజయ్‌కుమార్, వాసుదేవరెడ్డి, పల్లె రవికుమార్, తుంగబాలు, మన్నె గోవర్ధన్‌రెడ్డి, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఫూలే: కేటీఆర్
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా కొనియాడారు. ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. విద్యావేత్తగా, సంఘ సంసర్తగా ఫూలే చేసిన సేవలు వెలకట్టలేనివని పేరొన్నారు. జ్యోతిబాఫూలే ఆశయ సాధనలో భాగంగానే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద బీసీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య అందించినట్టు వివరించారు. బీసీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనే లక్ష్యంతో ఫూలే పేరు మీద విదేశీ విద్యా సాలర్షిప్ను అందజేసి గౌరవించిందని వెల్లడించారు.