ఎంసీ హరి, వేద జలంధర్, మనోజ్, శశిధర్ ప్రధానపాత్రలు పోషించిన విభిన్న కథాచిత్రం ‘అమీర్ లోగ్’. రమణారెడ్డి సోమ దర్శకుడు. మాధవిరెడ్డి సోమ నిర్మాత. స్పిరిట్ మీడియా సంస్ధ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 21న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో ఈ సినిమాలోని ‘అవ్వల్ దావత్..’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘హైదరాబాదీల మంచి మనసుల్ని తెరపై ఆవిష్కరించాలనే ఉద్దేశంతో తయారు చేసుకున్న కథ ‘అమీర్ లోగ్’. శ్రేయోభిలాషులకు సినిమా చూపిస్తే అభినందించారు. డబ్బున్నవారు అమీర్ లోగా?.. సంతోషంగా ఉండేవారు అమీర్ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన వారికి అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక హైదరాబాద్ మనుషులపై ప్రేమ, గౌరవం మరింత పెరుగుతుంది’ అని దర్శకుడు రమణారెడ్డి చెప్పారు. ఇంకా నిర్మాత మాధవిరెడ్డి, సంగీత దర్శకుడు స్మరణ్‌సాయి, నటి వేద జలంధర్, నటులు ఎంసీ హరి, మనోజ్ తదితరులు మాట్లాడారు.