ఏ వ్యక్తికైనా ఆది గురువు తల్లే. ఆ తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి ఏది మంచో, ఏది చెడో చెప్పేవారు గురువులు. అటువంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణమి. జన్మనిచ్చిన తల్లినీ, హితాన్ని చేకూర్చే తండ్రినీ, జ్ఞానాన్ని పంచిన గురువును దేవుడితో సమానమని, పూజించమని భారతీయ సంస్కృతి చెబుతుంది.
గురువు శబ్దంలో మొదటి ‘గ’కారం గణేశ బీజం. రెండోదైన ‘ర’కారం అగ్ని బీజం. ‘గ’కారానికి పరమందు ఉన్న ‘ఉ’కారం విష్ణుబీజం. ‘గ’కార శబ్దోచ్ఛరణ వల్ల కార్యసిద్ధి నిర్విఘ్నంగా జరుగుతుంది. ‘ర’కార వర్ణోచ్ఛరణతో సర్వపాపాలు దహించుకుపోతాయి. ‘ఉ’కార ఉచ్ఛరణతో సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. కనుక గురువు అనేది గణేశ, అగ్ని, విష్ణు దేవాత్మక మంత్రం. ముగ్గురు దేవతల కలయిక వల్ల ఏర్పడే రెండక్షరాల మంత్రం గురు శబ్దం. మనపై శివునికి కోపం వస్తే గురువు రక్షించగలరు. కానీ, గురువుకు కోపం వస్తే ఆ పరమశివుడు సైతం రక్షించలేడు. గురువు త్రిమూర్తి స్వరూపం. ఆయనే పరమతత్వం. అటువంటి గురువును భక్తితో పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి.
గురు పరంపరకు ఆద్యుడు వ్యాస భగవానుడు. ఆయన పుట్టినరోజే ఆషాఢ పౌర్ణమి. ఆ రోజును వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా ఆచరిస్తాం. శ్రీమహావిష్ణువే స్వయంగా వేదవ్యాసుడై భక్తికావ్యమైన భాగవతాన్ని రచించి లోకానికి విష్ణుభక్తిని ప్రబోధించినట్లు రుషులు చెప్పారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, అష్టాదశ పురాణాలు, పంచమ వేదమైన మహాభారతం, భాగవతం.. ఇలా అద్భుత జ్ఞాన సంపదను అందించాడు. అందుకే ఎవరు ఏది చెప్పినా వ్యాసుడు చెప్పినదే చెప్పాలి. కొత్తగా చెప్పడానికి ఏమీ లేకుండా సర్వమూ తానే అయి బోధించిన ఆది గురుమూర్తి వ్యాసుడు. లోకానికి అంతటికీ జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుడిని పూజించుకోవడానికి ఏర్పడిందే వ్యాస పౌర్ణమి. ఈరోజున మనకు భగవత్ జ్ఞానాన్ని అందించిన, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పూజించుకోవడం సంప్రదాయం కాగా, వేదం ప్రతిపాదించిన మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయస్వామి, ఆది శంకరా చార్యులు, గురు రాఘవేంద్రస్వామి, భగవద్రామానుజులు, రమణ మహర్షి లాంటి వారిని స్మరించుకోవడం కూడా గురు పౌర్ణమి నాడు ఆనవాయితీగా వస్తున్నది.

గురుపౌర్ణమి చాతుర్మాస దీక్షా సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడికీ వెళ్లకుండా ఒకచోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమిది. ఈ కాలంలో తమకు సమీపంగా ఉన్న తపస్సంపన్నులను పూజించి, జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి ప్రతీకగా నిలుస్తున్నది. హిందూ సంప్రదాయాలు పాటించే భారతదేశం, నేపాల్‌తో పాటు బుద్ధ, జైన సంప్రదాయాలు పాటించే పలుచోట్ల గురుపౌర్ణమిని అత్యంత ఘనంగా జరుపుకొంటారు. ఈరోజున ప్రజలు తమ ఆధ్యాత్మిక గురువులను పూజిస్తారు. ‘గుకారశ్చాంధకారోహి రుకారస్తేజ ఉచ్ఛతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురుదేవ న సంశయః’ అని ఆర్షవాక్కు. గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని వేదాలు చెబుతున్నాయి. తండ్రి కొడుకులకు పిత్రార్జితం ఇచ్చినట్లే గురువు తన శిష్యులకు జ్ఞానసంపదను పంచుతారు. సాధకుడి జీవితంలో గురువు ఒక కీలక అధ్యాయం. సద్గురు కటాక్షం వల్ల చక్కని ఉపదేశం లభించిన శిష్యుడు శాశ్వత ఆనందం పొందుతాడు.
కాలం, పరిస్థితులు, పద్ధతులు, పరికరాలు మారిన క్రమంలో గురుశిష్యుల బాధ్యతలు కూడా పెరిగాయి. పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర. కాగా, జ్ఞానాన్ని పొందాలనుకునే విద్యార్థి కుతూహలానికి గురువు వారధిగా మారుతారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు సమాజంలో మంచిపేరు తెచ్చుకున్నట్లయితే అదే తనకు అత్యుత్తమ పురస్కారంగా గురువులు భావిస్తారు. అటువంటి గురువులు నేడు కొన్ని విద్యాలయాల్లో నిబద్ధతతో పనిచేస్తుండగా వారి శిక్షణలో ఎంతోమంది విద్యార్థులు సమున్నత లక్ష్యసాధనతో సమాజానికి హితవరులుగా ఎదిగారు. గురువును, గోవిందుడిని ఎదురుగా నిలబెట్టి ముందు నీవు ఎవరికి నమస్కరిస్తావు అంటే గురువుకే నమస్కరిస్తానని, ఎందుకంటే గోవిందుడి గురించి మొదట చెప్పింది గురువే కదా అంటాడు సంత్ కబీర్దాస్. అటువంటి ఆర్ష సంస్కృతిలో జన్మించిన భారతీయులకు గురు పౌర్ణమి గొప్ప పండుగ. ఈ సందర్భంగా తమ గురువులను ప్రతి ఒక్కరూ సేవించి తరించాలి.