హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం ఉద్దేశించిన జువైనల్ జస్టిస్ చట్టాలను సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషి పిలుపునిచ్చారు. ఆయా చట్టాలను అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం, యునిసెఫ్ చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ‘జువైనల్ జస్టిస్’పై స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్‌కోషి, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్‌బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ కోషి మాట్లాడుతూ.. పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాల ఏర్పాటు ఎంతో అవసరమని చెప్పారు. జువైనల్‌కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలకపాత్ర పోషిస్తున్నదని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్ గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.