హైదరాబాద్: రాజ్యాంగాన్ని పక్కాగా పాటించడంతోపాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని వెల్లడించారు. 10 జిల్లా కోర్టుల్లో డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. ఇటీవల హైకోర్టు, జిల్లా, తాలూకా కోర్టుల్లో కక్షిదారుల సౌకర్యార్థం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
హైకోర్టు నూతన భవనానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ఈ భవనం ఉంటుందని చెప్పారు. పెండింగ్ కేసులు న్యాయమూర్తులకు సవాల్ లాంటివని వెల్లడించారు. న్యాయవాదుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. గతేడాది జనవరిలో 2.31 లక్షల పెండింగ్ కేసులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 2.29 లక్షలకు తగ్గించిచామన్నారు. కీలక కేసుల వాదనలు, ప్రఖ్యాతిగాంచిన లాయర్లను యువ న్యాయవాదులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.