హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ పవన్‌కుమార్, మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) చైర్మన్‌గా మరో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. హెచ్ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బీ కిశోర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 5న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలెక్షన్ కమిటీ వీరిని ఖరారు చేసింది. లోకాయుక్తగా నియామకమైన జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్లకు చెందినవారు.
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారు. 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2022 లో పదవీ విరమణ చేశారు. హెచ్ఆర్సీ చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ షమీమ్ నల్లగొండకు చెందినవారు. నాగపూర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 2002లో నల్లగొండ జిల్లా సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఓయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా, జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్(జ్యుడీషియల్)గా పనిచేశారు. 20 17లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2022 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు.