హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అభివృద్ధితో పాటు భాషా, సంస్కృతులను రక్షించుకోవాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తమిళనాడు తరహాలో మన పాలకులూ భాషాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విజయవాడలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో శనివారం ఆయన మాట్లాడారు.
తెలుగు జాతి కీర్తి నిత్యం వెలుగొందాలని ఆకాంక్షించారు. తెలుగు భాష పలుకుబడి వినసొంపైనదని, సంగీతంలా ఉంటుందని పేర్కొన్నారు. వ్యా పార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి తెలుగును కొల్లగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరాదని ఆయన హెచ్చరించారు.