హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావుకు కూడా వివరణ కోరుతూ లేఖ రాసింది. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి బీఆర్కే భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాము విచారణ జరుపుతున్న అంశంపై మొత్తం 25 మందికి లేఖలు రాశామని తెలిపారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే రాజకీయ నాయకులని చెప్పారు. మిగిలినవారంతా ఈ అంశంతో సంబంధం గలవారేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు ఏప్రిల్‌లోనే లేఖ రాశామని, అయితే ఎన్నికలున్నాయన్న కారణంతో సమాధానమివ్వలేదని, సమయం కావాలని ఆడిగారని తెలిపారు.
ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయమివ్వాలని కేసీఆర్ కోరారని చెప్పారు. అయితే తమకు ప్రభుత్వం విధించిన గడువులోగా నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు సూచించామని తెలిపారు. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు ప్రత్యక్ష విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అన్నారు. అధికారుల నుంచే కాకుండా అనధికారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. అప్పట్లో ఏం జరిగిందో అధికారుల ద్వారా తెలుసుకుంటున్నామని అన్నారు. విద్యుత్తు సంస్థలకు చెందిన మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీతో కూడా సమావేశమయ్యామని చెప్పారు. మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్చందాతో సోమవారం సమావేశమై వారి నుంచి వివరణలు తీసుకున్నామని తెలిపారు. కమిషన్ మంగళవారం ఎస్కే జోషి, అర్వింద్‌కుమార్ నుంచి వివరణలు తీసుకుంది. వారు ప్రత్యక్షంగా హాజరుకాకపోవడంతో.. వర్చువల్‌గా వారితో సమావేశమై వారి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. త్వరలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాను సైతం విచారించే అవకాశమున్నట్టు తెలిసింది.
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పం దం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్‌పై విచారణ జరుపుతున్నామని జస్టిస్ నర్సింహారెడ్డి చెప్పారు. ఈ మూడింటికి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలోనే పనులు అప్పగించారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ప్లాంట్స్ నిర్మాణం.. ఈ మూడు నిర్ణయాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ మాత్రమే తీసుకున్నదని, జెన్కోలకు సంబంధంలేదని అన్నారు. 2 రాష్ర్టాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారమివ్వాలని చెప్పారు. భారీగా నిధులు వెచ్చించి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం జరిగిందనేది తేల్చాల్సి ఉందని అన్నారు. అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే భద్రాద్రిలో సబ్ క్రిటికిల్ టెక్నాలజీ వాడారని పేర్కొన్నారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణపనులను నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని, అయినా ఈ ప్లాంట్ నిర్మా ణం ఇంకా పూర్తికాలేదని అన్నారు. ఆగస్టు వర కు ఒక రైల్వేలైన్ అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా, ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదని చెప్పారు. బీహెచ్ఈఎల్కు చెందిన అధికారుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి సైతం సమాచారాన్ని తీసుకుంటున్నామని తెలిపారు.