హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించేవారికి వ్యవస్థ అండదండలు ఎంతో అవసరమని, జడ్జీలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సమాజ హితమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ జ్యడిషియల్ అకాడమీలో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల 2వ వార్షిక సమావేశ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి ప్రసంగిస్తూ.. రుజువర్తన, శాస్త్రీయ ఆలోచన, అధ్యయన శక్తి, కష్టపడి పనిచేయడం, వివాదాలను త్వరగా పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయాన్ని అందించాలన్న లక్ష్యం న్యాయమూర్తుల ఔన్నత్యాన్ని పెంచుతాయని తెలిపారు. సాధన అనేది జీవితంలో అంతర్భాగం కావాలని, ఎవరినైనా అదే విజయతీరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. వ్యవస్థ అంటే ఓ భవనం కాదని ఒక ఆలోచనతో కూడినదని చెప్పారు. న్యాయవృత్తిలో ముందడుగు పడాలంటే ఇలాంటి సమావేశాలు కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ కే లక్ష్మణ్, అఖిల భారత న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు అజయ్ నధాని, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ఉపాధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ పాల్గొన్నారు.