KTR | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందని ఆయనపై అవినీతిపరుడనే ముద్ర వేసి రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హైకోర్టును కోరారు. ఫార్ములా-ఈ కేసులో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వాలు మారితే.. పాత పాలకులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా అయితే ఇకపై ఎవరూ మంత్రిగా పని చేయలేరని పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి భాగస్వాములైన సంస్థలు ఒక్క పైసా కూడా కేటీఆర్‌కు చెల్లించనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని, దీనిపై అవినీతి కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారానే జరిగితే అవినీతికి ఆస్కారం ఎక్కడుంటుందని, అందువల్ల పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 3(1)(ఏ) కింద కేసు నమోదుకు వీలు లేదని స్పష్టంచేశారు. జరిగిన నేరం ఏమిటో, ఎకడ జరిగిందో ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని తెలిపారు. నేరం ఏమిటో ఎకడో పేరొనకపోవడాన్ని బట్టి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని తుది ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ కేసులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించింది.
ఒక మంత్రి హోదాలో కేటీఆర్ ఫార్ములా- ఈ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని, ఇది విధాన నిర్ణయమని, ఇందులో అక్రమాలు జరిగాయని కేసు పెడితే ఇకపై ప్రభుత్వంలో ఎవ్వరూ మంత్రిగా విధులు నిర్వహించలేరని న్యాయవాది సిద్ధార్థ్ దవే పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 వర్తిస్తుందంటూ చంద్రబాబునాయుడు కేసులో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులు తమకు కూడా వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం సరికాదని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 వర్తించదనే మరో తీర్పును కూడా సుప్రీంకోర్టు వెలువరించిన విషయాన్ని గుర్తుచేశారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు వేచి ఉండాలని చెప్పారు. ఇప్పుడున్న తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధులకు ఐపీసీ 409 సెక్షన్ కింద కేటీఆర్‌పై కేసు చెల్లదని అన్నారు. చంద్రబాబు కేసుకు, ఇకడ కేటీఆర్‌పై నమోదైన కేసుకి ఒక పోలిక ఉందని, అది రాజకీయపరమైనదేనని తెలిపారు.
జరిగిన నేరం ఏమిటో, ఎకడ జరిగిందో ఎఫ్ఐఆర్లో పేర్కొనలేదని సిద్ధార్థ్ దవే తెలిపారు. నేరం ఏమిటో ఎకడా పేరొనకపోవడాన్ని బట్టి ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఫిర్యాదులోగానీ, ఎఫ్ఐఆర్లో గానీ పిటిషనర్ కేటీఆర్‌కు ఎలాంటి దురుద్దేశం ఆపాదించలేదని గుర్తుచేశారు. ఐపీసీ సెక్షన్ 405, 409ల్లో సొమ్ము అక్రమంగా అప్పగించినప్పుడు లేదా దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయని తెలిపారు. కేటీఆర్‌పై ఆ తరహా అభియోగాలు, దురుద్దేశం వంటివి ఆపాదించనప్పుడు ఆ సెక్షన్లు చెల్లవని చెప్పా రు. నమ్మకంతో సొమ్ము అప్పగించినపుడు, దుర్వినియోగం జరిగితేనే ఈ నేరాలు ఆపాదించవచ్చని తెలిపారు. ఫార్ములా-ఈ వ్యవహారంలో డబ్బులు అప్పగించడం లేదా ఆస్తి అప్పగింత వంటివి ఏమీ జరగలేదని అన్నారు. హెచ్ఎండీఏ ఇన్వాయిస్ ప్రకారమే నగదు చెల్లింపులు జరిగాయని వివరించారు.
మంత్రి అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్టుగా భావించకూడదని సుప్రీంకోర్టు సతీశ్‌చంద్ర శర్మ కేసులో స్పష్టమైన మార్గదర్మకాలు జారీ చేసిందని సిద్ధార్థ్ దవే గుర్తుచేశారు. ఆ తీర్పు ప్రకారం కూడా కేసు నమోదు చెల్లదన్నారు. మంత్రిగా లేదా వ్యక్తిగా కేటీఆర్ డబ్బులు తీసుకోలేదని, ఒక పైసా కూడా ఆయనకు చేరలేదని చెప్పారు. కేటీఆర్ తన వద్ద ప్రభుత్వ సొమ్ము ఏమీ ఉంచుకోలేదని తెలిపారు. ప్రభుత్వం చెప్తున్నట్టుగా అనుమతులు లేవన్నదే నిజమని భావించినా అది దుర్వినియోగం కిందకు ఎలా వస్తుందో అర్థం కావడంలేదని అన్నారు.
నిధులు ఎవరికి చెల్లించారో, ఒప్పందం ఎవరితో ఎవరు చేసుకున్నారో అన్ని పత్రాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నప్పుడు ఆనాడు మంత్రిగా చేసిన కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని సిద్ధార్థ్ దవే వాదించారు. రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలు, లభించిన పేరు ప్రతిష్టలను వదిలేసి తప్పుడు కేసు బనాయించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. మంత్రి తీసుకున్న నిర్ణయంలో చట్ట నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా సంబంధిత అధికారులదే తప్ప మంత్రులది కాబోదని అన్నారు. కేటీఆర్‌కు డబ్బులు చెల్లించినట్టు అధికారుల ఫిర్యాదులో గానీ, ఏసీబీ ఎఫ్ఐఆర్లో గానీ లేదని, ఈ పరిస్థితుల్లో పిటిషనర్ అవినీతికి పాల్పడినట్టుగా కేసు నమోదు చేయడమే చెల్లదని తేల్చి చెప్పారు.
ఎఫ్ఐఏతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తొలి విడత 25 శాతం 2023 సెప్టెంబర్ 26న, రెండో విడత 25 శాతం అక్టోబర్ 4లోగా, మిగిలిన 50 శాతం అక్టోబర్ 31లోగా ఎఫ్ఐఏకు చెల్లించాల్సివున్నదని తెలిపారు. నాటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, అరవింద్‌కుమార్ హెచ్ఎండీఏ కమిషనర్ హోదాలో పురపాలకశాఖ మంత్రి ఆమోదం కోసం ఫైల్‌ను పిటిషనర్‌కు పంపారని చెప్పారు. పదో సీజన్ నిర్వహణకు మొత్తం రూ.160 కోట్లు అనుమతించాలని ఫైల్లో ఉన్నదని అన్నారు. రెండు విడతల్లో చెల్లింపులు జరిగాయని, మిగిలిన 50 శాతం చెల్లించాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయని, అనంతరం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఖజానాకు రూ.55 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు.
ఫార్ములా ఈ నిర్వహణకు 2023 సెప్టెంబర్ 27న కుదిరిన ముసాయిదా ఒప్పందంలోనే హెచ్ఎండీఏ ప్రమోటర్‌గా ఉన్నదని తెలిపారు. పదో సీజన్ తప్పిపోకుండా ఉండేందుకు వాయిదాల ప్రకారం చెల్లింపులకు ఒప్పందం జరిగిందని చెప్పారు. విధానాల పరంగా లోటుపాట్లు, లోపాలుంటే వాటిని సంబంధిత శాఖల అధికారులు సరిచేయాలేగానీ అందుకు నాడు మంత్రిగా చేసిన పిటిషనర్‌ను బాధ్యుడ్ని చేయడం చెల్లదని అన్నారు.
ఫార్ములా- ఈ వ్యవహారం ఒప్పందంలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నది కదా అన్న హైకోర్టు ప్రశ్నకు దవే సమాధానం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్‌ను ఎదురోనే క్లాజ్ ఉన్నదని తెలిపారు. ముందే ఒప్పందం జరిగిందని, ఇదేదో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని ఎన్నికల సంఘం చెప్పకపోయినా ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే 14 నెలలకు కేసు నమోదు చేసిందని చెప్పారు. ఆయా కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం కేసు నమోదుకు జాప్యం చెల్లదని అన్నారు. ఆ కేసుల్లో మూడు నెలల జాప్యానికే సుప్రీంకోర్టు అంగీకరించలేదని గుర్తు చేశారు.
రెండో ఒప్పందం చేసుకునే ముందే హెచ్ఎండీఏ చెల్లింపులు జరిపిందని, ఎవరికి చెల్లించిందో, ఆ నగదు ఎకడికి చేరిందో, ఎవరికి చేరిందో దర్యాప్తులో తేలాల్సి ఉన్నదని ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, ఫిర్యాదుదారు దానకిషోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదించారు. కేటీఆర్ పిటిషన్‌ను కొట్టేయాలని, దర్యాప్తును అడ్డుకోవద్దని కోరారు. మంత్రిగా కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిగాయని అన్నారు. ఆర్థిక శాఖ అనుమతి పొందకుండానే చెల్లించారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహారం నడిచిందన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేస్తున్నట్టు వెల్లడించారు. అప్పటి వరకు పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని, ఈ మేరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు తెలియజేశారు.
నిధుల చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా అది కూడా అధికారుల ద్వారా జరిగినప్పుడు అది అవినీతి ఎలా అవుతుందని దవే ప్రశ్నించారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినపుడు దానికి ఎవరు బాధ్యులో విచారణ చేపట్టాల్సిన బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని చెప్పారు. అలాంటి వాళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. అంతేగానీ మంత్రిగా చేసిన పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడం సరికాదని అన్నారు. ఒప్పందం కొనసాగింపులో భాగంగా చెల్లింపులు జరిగాయనే విషయాన్ని ప్రభుత్వం గమనంలోకి తీసుకోకుండా కక్షసాధింపు చర్యలతో కేసు బనాయించిందని చెప్పారు. ప్రభుత్వం అనేది శాశ్వతమని, గత పాలకులపై కక్ష సాధింపు, వేధింపులతో కేసులు పెడుతూపోతే ఏ మంత్రీ పనిచేయలేరని అన్నారు. గత పాలకుల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒప్పందాన్ని కొనసాగించలేకపోవడాన్ని తప్పుపట్టారు. ఫార్ములా సీజన్-9ను పిటిషనర్ మంత్రిగా ఉండగా సమర్థంగా నిర్వహించారని, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఫార్ములా-ఈ సీజన్ -10ను నిర్వహించలేదని చెప్పారు. రెండు విడతలుగా ప్రభుత్వం డబ్బులు చెల్లించిన తర్వాత మూడోదైన చివరి విడత చెల్లింపులకు ఆసారం ఉన్నప్పటికీ ప్రభుత్వం తప్పుకున్నదని తెలిపారు. దీంతో సీజన్ -10 నిర్వహించని ప్రభుత్వం ఆ వ్యవహారం నుంచి తప్పించుకోవడంలో భాగంగానే పిటిషనర్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందని చెప్పారు.
ఫార్ములా -ఈ కార్ రేస్ ఒప్పందంలో కీలకమైన నిర్వాహకులను ఎందుకు నిందితులుగా చేర్చలేదని దవే ప్రశ్నించారు. సొమ్ము తీసుకున్న నిర్వాహకులను వదిలేసి గతంలో మంత్రిగా పని చేస్తున్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేరంగా పరిగణించి కేసు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాం కులు, శాఖాధికారులు చూసుకోవాలని అన్నా రు. విదేశీ నిధుల లావాదేవీల వ్యవహారంలో చట్టాల అమలు బాధ్యత ప్రధానంగా బ్యాంకులదేనని చెప్పారు.