హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తాను విచారణ చేసిన అంశాలేవీ మీడియాకు వెల్లడించలేదని, తన పరిశీలనకు వచ్చిన అంశాలపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేదని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఆయన మంగళవారం టీవీ9తో మాట్లాడారు. మీడియా సమావేశాలు నిర్వహించని దర్యాప్తు కమిషన్లు లేవని అన్నారు. టీవీ9 ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు జస్టిస్ నర్సింహారెడ్డి ఇచ్చిన సమాధానాలలో కొన్ని ఇలా ఉన్నాయి..
కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వినే ఉంటారు. మీరు పక్షపాతంగా వ్యవహరించారేమోనన్న అనుమానం కలిగేలా ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీరేమంటారు?
ధర్మాసనం వ్యాఖ్యానించిందన్నది సరికాదు. అక్కడ మూడు నాలుగు పాయింట్లు వాళ్లు లేవదీశారు. అసలు ఎంక్వైరీనే వేయకూడదన్నది ఒకటి. తర్వాత లీగల్ ఇష్యూస్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీ అని ఒకటి. ఆ తర్వాత ఈ ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టడం ఒకటి. ప్రెస్కాన్ఫరెన్స్ రఫ్ ట్రాన్స్లేషన్ పెట్టి దానిని కోర్టు ముందు ఉంచారు. దానిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. అభిప్రాయాలు వ్యక్తంచేసినట్టు కాదు అని హైకోర్టు పేర్కొనగా.. అభిప్రాయం వ్యక్తంచేసినట్టు అవుతుందేమోనన్న అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తపరిచింది. ఈ లోగానే ఈ డెవలప్మెంట్స్ జరిగాయి.
మీరు కూడా చైర్మన్‌గా కొనసాగకూడదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు కదా?
ఈ సందర్భంలో రెండు విషయాలు ప్రస్తావించాలి. ఒక పార్టీకి ఇబ్బంది అయినప్పుడు ఆ జడ్జిగాని.. కోర్టుగాని ఎట్లా అవాయిడ్ చేయాలన్న ఆలోచన మామూలుగా ఉంటది. సమంజసమైన కారణం ఉంటేనే జడ్జి తప్పుకుంటరు. నేనొక చిన్న విషయం చెప్తాను. తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్నప్పుడు జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ రిపోర్టు.. మీకు అంత తెలుసు. అప్పుడు అటార్నీ జనరల్ వచ్చారు. సీక్రెట్ రిపోర్టు కాపీ ఇచ్చారు. ఒక జడ్జిగా నేను కొన్ని కామెంట్లు చేశాను. అది నచ్చనివాళ్లు.. కొంతమంది ఇప్పుడు కేసీఆర్ గారన్న మర్యాదకొద్దీ భాష కొంచెం తీవ్రంగానే వాడారు. నన్ను తప్పుకోమన్నారు. వాళ్లు ఒక స్టెప్ ముందుకేసి ఈయన్ను చట్టం ప్రకారం అభిశంసించాలని, పోస్టులో నుంచి తీసేయాలన్న వాదనలు తెచ్చారు. అప్పుడు నేను తప్పుకున్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. మేం ఆత్మసాక్షిగా పనిచేస్తం. ఒకరు పనిగట్టుకుని అదే చేస్తే వ్యవస్థే నడవదు. నన్ను అభిశంసించేందుకు ప్రయత్నించారు. నేను ప్రస్తావన చేయవచ్చో లేదో తెలియదు కానీ బెదిరించారు.. మభ్యపెట్టారు.. ఎన్నెన్నో జరిగాయి. వాటికి లొంగకుండా ఒక న్యాయవ్యవస్థలో ఉన్నాం కాబట్టి సరియైన పద్ధతిలో ముందుకెళ్లాం.
కేసులోని మెరిట్స్‌ను మీరు ప్రస్తావించారు. మీరు ఒక ఒపీనియన్‌కు వచ్చినట్టు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కదా?
సుప్రీంకోర్టు అలా అననేలేదు. ప్రాథమిక వాదోపవాదాలే జరుగుతున్నాయి. ఇంకా లోపలికి పోలేదు. ‘జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ డన్.. బట్ ఆల్సో షుడ్ సీమ్డ్ టూ బీ డన్’ అన్నదాంట్లో వస్తది. ఇంకా కొంచెం లోతుగా విచారిస్తే అభిప్రాయం వెలిబుచ్చారా లేదా అన్నది తెలిసేది.
మరి సుప్రీం ధర్మాసనం అట్లా ఎట్లా అభిప్రాయపడింది?
దాని మీద నేను కామెంట్ చేయదల్చుకోలేదు. ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద ఉన్న కమిషన్ ఏదైనా ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టకుండా నడిచిందని ఒక్కటి చూపించండి. నా మీద ప్రెస్ మిత్రుల నుంచి ఏమీ చెప్పడంలేదని కంప్లయింట్లు వచ్చినయి. రఫ్‌గా ఎస్టిమేట్ ప్రకారం ఇంత అంటున్నారు.. సబ్ క్రిటికల్‌కు సూపర్క్రిటికల్కు ఇంత తేడా వస్తుందని అంటున్నరు అని చెప్పిన. వాళ్లు ఏం చెప్పారో నేను అదే చెప్పి విచారిస్తే పూర్వాపరాలు తెలుస్తాయని అన్న. దీంట్లో అభిప్రాయమొక్కడుంది? చాలా పొరపాటు ఇది.
కేసీఆర్‌ను విచారణకు పిలిచారు. ఆయనను విచారించిన తర్వాత కన్‌క్లూజన్‌కు రావాల్సింది కదా?
మేం కన్‌క్లూజన్‌కు ఎప్పుడొచ్చాం. రాలేదు కదా.. వాళ్ల అభిప్రాయం వెలిబుచ్చిన తర్వాత కన్‌క్లూజన్‌కు వచ్చేవాళ్లం. కన్‌క్లూజన్ ఎప్పుడూ బయటికిచెప్పరు. బై ఏ ఆర్డర్. ఇంకోటి కోర్టులో కేసు జరుగుతుంది. వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఎందుకిట్లా చేశారు. ఈజ్ ఇట్ ఇల్లీగల్ అని మేం అడుగుతాం. ఈ కారణాల వల్ల కాదని అటు వైపు అభిప్రాయం వస్తుంది. అటు ఇటూ తిరిగి తిరిగి జడ్జిమెంట్ వస్తుంది. మధ్యమధ్యలో ఎన్నో అబ్జర్వేషన్స్ వస్తుంటాయి. అవన్నీ జడ్జిమెంట్లు కావు. అట్లా అంటే జడ్జి నోరు విప్పితే కన్‌క్లూజన్‌కు వచ్చినట్టు అవుతుంది. అది చాలా పొరపాటు.. ఆ అభిప్రాయమే తప్పు.
ఈ కేసు విషయానికి వస్తే మీరు ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ పుట్టినప్పటి నుంచి ప్రెస్‌మీట్ పెట్టకుండా ఉన్న ఒక్క కమిషన్‌ను చూపించండి. షా కమిషన్, ముంద్రా కమిషన్ అన్నీ ప్రెస్మీట్లు పెట్టినయి. కమిషన్ వేయడంలో ముఖ్యఉద్దేశమే బహిరంగ విచారణ. దాని ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ కూడా చూసి ఉంటరు. మీకు ఎవరికైనా, ఏవైనా విషయాలు తెలిస్తే చెప్పండి అని పిలిచాం. ఇటు ప్రభుత్వం చెప్పింది కాదు. ఇటు. వీళ్లు చెప్పింది కాదు. సరైన కన్‌క్లూజన్‌కు వచ్చేందుకు వీలుంటదని చెప్పినం.
కన్‌క్లూజన్‌కు రాకముందే ఫ్యాక్ట్స్ ఏవైనా రివీల్ చేశారా?
నేను అస్సలు చేయలేదు. ఇది పొరపాటు. దుర్మార్గమైన ఆలోచన. జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ మా పై ఫ్లోర్లో పనిచేస్తరు. వాళ్లు దాదాపు ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటరు. ఈ రిపోర్టర్స్ వచ్చి మీ కమిషన్‌ది ఏమైంది అని మమ్మల్ని అడిగేవారు. అప్పటికే పాత సెక్రటరీ, సీఎండీల వాంగ్మూలాలు తీసుకున్నాం. మేం ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టకపోయే సరికి కొన్ని వార్తాప్రతికలు ఊహాజనితంగా రాసుకుంటూ పోయాయి. దీనికి అడ్డుకట్టవేసేందుకు.. ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్ ఇదీ. ఫలానా వాళ్లు ఇచ్చిన జవాబులివీ. మేం ఫలానా వద్దకు పోయి చూసినం.. అని చెప్పాను తప్ప అభిప్రాయానికి రాలేదు. కన్‌క్లూజన్‌కు రాకముందే ఎట్లా చెప్తాను?
ఇందాక మీరు బెదిరింపులకు గురయ్యామన్నారు. అది ఎప్పటి సందర్భం ?
జడ్జిగా ఉండగా జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సీక్రెట్ రిపోర్టు పెట్టారు కదా. అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్చేస్తం అని బెదిరింపులు కూడా వచ్చినయి.
పొలిటికల్ సైడ్ నుంచా.. పొలిటీషియన్ల నుంచా?
అవి ఇప్పుడు ఎందుకు? కానీ.. అయితే నిన్ను అభిశంసిస్తాం. నిన్ను అలా చేస్తాం.. ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించారు. నేను అట్లాంటి వాటికి లొంగకుండా పని చేసిన. జడ్జిమెంట్ చెప్పేరోజు హెవీ ప్రెషర్ పై లెవల్ నుంచి. ఈ రకమైన ప్రెషర్‌కు నేను లొంగను అని చెప్పి. వ్యవసాయం చేసుకుని బతుకుత కానీ ఇట్లాంటి పనులు చేయను అని చెప్పిన. చీఫ్ జస్టిస్ దేవేంద్రగుప్తా గారు ఉండె. చాంబర్‌కు పిలిచి, నాతో ‘ప్రెషర్ వేయరని నువ్వెట్లా అనుకున్నవు. నాకు తెలుసు ఆ పార్టీ అటువంటిదే. నాకు తెలిసే నిన్ను వేసిన. పో జడ్జిమెంట్ చెప్పుపో’ అని ఆర్డర్ పాస్ చేస్తే వచ్చి తీర్పు చెప్పిన. ఆ కేసు సుప్రీంకోర్టులో ఆరు నెలల క్రితం ఆప్హోల్డ్ అయ్యింది. తెలిసి తప్పుచేయలేదు. తెలువకుండా చేసుంటే ఉండవచ్చు.
మీకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ విలువలతో ఉంటారని, ఒత్తిళ్లకు తలొగ్గరని పేరుంది. ఇప్పుడు ఇవ్వాళ్టి ఇన్సిడెంట్‌తో మీ మీద మచ్చపడిందని భావిస్తున్నారా?
ఆ క్వశ్చనే లేదు. మచ్చకాదు. ఈరోజు నేను రాసిన మెమో చూసిండ్రా! ‘లాస్ట్ వర్డ్ సెడ్ బై ఏ జడ్డ్ ఐయామ్ నాట్ బయాస్డ్’ అని చెప్పిన. ఆ మాట చెప్పేరోజు వచ్చిన్నాడు పదవీకే విలువుండదని. ఈ కమిషన్ ఉంటే ఉంటది.. లేకపోతే లేదు.
సుప్రీం తీర్పుపై మీ ఫైనల్ కామెంట్ ఏమిటి?
ఐయామ్ ఫీలింగ్ రిలీవ్డ్. కొంతమంది కొన్ని కామెంట్లు చేసినట్టు నాకు తెలిసింది. అయితే అహంకారంతో.. లేదంటే అజ్ఞానంతో చేసి ఉంటారు. నేను తెలంగాణ మాత్రమే కాకుండా అందరి సుఖం కోరుకునే వాడిని. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, జ్యుడీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ రెండూ విలువలతో ఉండాలి. ఎంక్వైరీ ఎట్లుంటదంటే.. కొంతమంది పిలిచి చేయించుకుంటరు. అంత ధైర్యం ఉండాలి. అప్పుడు ఆ పర్సనాలిటీ నిలబడుతది. ప్రజాజీవితంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ సోర్స్. ఈ మిడిసిపాట్లు నిలబడవు. కాలగర్భంలో కలిసిపోతయి.
పెద్దపెద్ద చక్రవర్తులు పోయినరు. చూస్తున్నం కవితగారు ఇప్పుడు ఎక్కడున్నది? ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు.. వాళ్లు హైకోర్టులో కేసు వేసినప్పుడే. నేను ఆగిన. ఇంకా ఏమైనా జవాబులొస్తాయేమోనని ఆగిన. అందరివి అయిపోయినయి. ఈయనొక్కనిదే జవాబురావాలి. కొద్దిరోజులు ఆగిన తర్వాత రిపోర్టు రెడీ చేసిన. నేను ఈ శుక్రవారమో.. శనివారమో ఇద్దామనుకున్నా.. ఈలోగా సుప్రీంకోర్టులో కేసు పడిందని తెలిసింది. తెలిసిన తర్వాత కూడా ఇస్తే బాగుందడదు కదా.. అని జస్ట్ ఐ స్టాప్డ్ దేర్. ఐ ఫీల్ శాటిస్ఫైడ్ ఎబౌట్ ఇట్. అండ్ టూ బీ ఫ్రాంక్ విత్ .. ఐ అగ్రీడ్ సమ్ ఆఫ్ విత్ కంటెన్షన్స్ ఆల్సో.