హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తేతెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో విద్వేషాలు.. విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన పేరిట 16 వేల పేదల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసినట్టుగానే ఈ ఏడాది రంజాన్‌కు తోఫా ఇవ్వకుండా ముస్లిం మైనార్టీలను దగా చేసిందని విరుచుకుపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అబుల్ కలాం జయంత్యుత్సవాలకు కేటీఆర్ హాజరయ్యారు. కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలు డాక్టర్ దాసోజు శ్రవణ్, కార్తీక్‌రెడ్డి, సోహైల్‌తో కలిసి సుమారు 500 మంది ముస్లిం విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్ కలాం ఆజాద్ జయంతిని తెలంగాణ భవన్లో నిర్వహించడం ఆనందంగా ఉన్నదన్నారు. కేసీఆర్ మనిషిని, మనిషిగా మానవత్వంతో చూశారే తప్ప ఏనాడూ ఓట్ల కోసం వెంపర్లాలేడలేదని చెప్పారు. మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు 200కు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్, వరంగల్ డిప్యూటీ మేయర్ పదవులను సైతం మైనార్టీ నాయకులకు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు. అబుల్ కలాం పేరిట 2,751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షల చొప్పున సుమారు రూ. 438 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందజేశారని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రూ. 10 వేల కోట్లను మైనార్టీల సంక్షేమానికి ఖర్చుచేసిన ఖ్యాతి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
2014లో తెలంగాణ ఆవిర్భవించినప్పుడు హిందూ, ముస్లింల మధ్య అల్లర్లు చెలరేగుతాయని అనుమానాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో గంగా-జమున తెహజీబ్‌ను పాటించి వారి అనుమానాలను పటాపంచలు చేసి రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు.
-కేటీఆర్
ఎన్నికల ముందు మైనార్టీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలికొదిలేసి అబద్ధాల పునాదులపై పాలన చేస్తున్నదని కేటీఆర్ విరుచుపడ్డారు. ఆరు నెలల్లో మైనార్టీ గణన చేపట్టి జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. మైనార్టీ సబ్‌ప్లాన్ తెచ్చి బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని దుయ్యబట్టారు. యువత ఉపాధి కోసం ఏటా వెయ్యికోట్లు ఖర్చుచేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడాదిలో కనీసం లక్ష కూడా ఇవ్వలేదని విమర్శించారు. అబుల్ కలాం పేరిట ఇస్తామన్నా తోఫా-ఏ-తలీమ్కు అతీగతీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ చదివిన విద్యార్థులకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. మౌజమ్‌లు, ఇమామ్‌లకు రూ. 12 వేల గౌరవవేతనం ఇస్తామని చేసిన వాగ్ధానానికి విలువే లేకుండా పోయిందని చెప్పారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో గంటసేపు కూడా రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టలేదని కేటీఆర్ గర్తుచేశారు. కానీ రేవంత్ సర్కారు మొన్న దసరా, దీపావళి పండుగలప్పుడు కూడా 163 సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడ? ఈ చిచోరా సీఎం రేవంత్ ఎక్కడ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిచి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సలీం, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మసీయుల్లాఖాన్, వరంగల్ డిప్యూటీ మేయర్ మన్సూర్, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, గజ్జెల్ నగేశ్, ముఠా జైసింహ, అర్షద్, కలీం, ఇంతియాజ్, మసీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో గంటసేపు కూడా రాష్ట్రంలో కర్ఫ్యూ పెట్టలేదు. రేవంత్ సర్కారు మొన్న దసరా, దీపావళి పండుగలప్పుడు కూడా 163 సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదెందుకు? ఆ పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడంలేదు?’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. సర్వేలు సరే.. పథకాలేవి, ఉన్నవి ఉంచుతారా? ఊడబీకుతారా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యంకొనే నాథుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా ముసుగులో, మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూల్చుతున్నా, వారు గుండెలవిసేలా రోదిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానంలో చలనం లేదా? అని ప్రశ్నించారు. ఎకరాకు ఏడాదికి రూ. 15,000 రైతు భరోసా అందకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం అప్పులపాలవుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అరకొర రుణమాఫీతో రైతులను అరిగోస పెడుతున్నా, గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో దవాఖానల పాలవుతున్నా ప్రభుత్వం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ. 2,500, అవ్వాతాతలకు రూ. నాలుగు వేల పింఛన్ ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ పరిణమాలు చూస్తుంటే రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలనో? ప్రతికార పాలనో? అర్థంకావడం లేదని విమర్శించారు.
ఆర్థిక సమస్యలతో నేతకార్మిక దంపతులు ఆత్మహత్య చేసుకోగా అనాథలైన ముగ్గురు పిల్లలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ముగ్గురు చిన్నారులను ఆదుకుంటానని భరోసా ఇచ్చి.. సోమవారం ముగ్గురు చిన్నారుల పేరిట రూ.2 లక్షల చొప్పున పార్టీ ఫండ్‌ను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి మాట నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నాయకులు వారి నివాసానికి వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు.