(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిట్ట నిలువునా వంచించింది. బీసీ బిడ్డలు న్యాయపోరాటానికి సిద్ధం కావాలి’ అని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ఆర్డినెన్స్.. చట్టం ముందు నిలబడేది కాదని, ఒక్క అడ్వకేట్ జనరల్ కాదు కదా.. పది మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చి వాదించినా కొట్టుడు పోతుందని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ల బిల్లు వట్టి చెత్త కాగితమని, కాంగ్రెస్ వాళ్లు తెస్తామంటున్న ఆర్డినెన్స్ అంతకు మించి డొల్ల కాగితమని స్పష్టంచేశారు. ఈ బిల్లులు 9వ షెడ్యూల్ పరిధిలోకి వస్తేనే వాటికి రాజ్యాంగ భద్రత ఉంటుందని చెప్పారు. బీసీలకు ఎలాంటి హామీలు ఇవ్వకున్నా 1994 నుంచి 2018 వరకు అమలైన 34 శాతం బీసీ రిజర్వేషన్లను నిలుపుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసినా కోర్టులు అడ్డుకున్నాయని గుర్తుచేశారు. రేవంత్ విఫల ప్రయత్నం చారిత్రక నిర్ణయమా.. రాహుల్‌గాంధీ ఆశయమంటూ డోలుబాజా వాయిస్తున్నారని ఎద్దేవాచేశారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశించిన రిజర్వేషన్ పరిమితికి మించిన ఆర్డినెన్స్‌ను తేవడమనేది బీసీలను మోసం చేయడమేనని మండిపడ్డా రు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నిట్టనిలువునా వంచించారని, అధికారం వచ్చిన తర్వాత ఏడాదిలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 9 నెలలు నిమ్మలంగా ఇంట్లో కూర్చున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరా సమయం ముంచుకొచ్చిన తర్వాత డ్రామాలు చేస్తున్నారంటూ జస్టిస్ ఈశ్వరయ్య ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధితో తేల్చిచెప్పారు.
బిల్లును గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతికి పంపారు కదా?
ఇప్పుడు సవరణ ఏమిటి? 1994 చట్టంతో సమానం చేస్తున్నరు. వీళ్లకు ఎట్లా చేయాలో తెలివిలేదు. చట్టం చేసి 9వ షెడ్యూల్లో ఎట్లా కలుపుకోవాలో కూడా లీగల్ ఎక్స్పర్టిజం లేదు. లోకల్ బాడీస్‌లో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9 శాతం మొత్తం 69 శాతం రిజర్వేషన్లు, అట్లనే విద్యా ఉద్యోగాల్లో కూడా అవే రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండు సపరేట్ చట్టాలు చేసుకొని ఉభయ సభల్లో బిల్స్ పాస్ చేసుకున్నరు. ఆర్టికల్ 31 సీ కింద రాష్ట్రపతికి పంపారు సంతోషమే. రాష్ట్రపతికి నేరుగా బిల్లు పంపటానికి రాష్ర్టాలకు అధికారం లేదు. రాష్ట్రపతి ఆమోదం పొందితేనే బిల్లుకు సంపూర్ణ చట్టబద్ధత వస్తుంది. బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఒక కాపీ రాష్ట్రపతికి పంపారు. కేంద్రం ఈ బిల్లుపై క్యాబినెట్లో చర్చించి, తెలంగాణ ప్రభుత్వం పంపిన రెండు సపరేట్ బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టడానికి అంగీకరిస్తున్నామని ఆమోదం తెలుపుతూ ఉభయ సభల్లో చర్చకు పెట్టాలి. ఉభయ సభల్లో ఆమోదం పొందితే అప్పుడు బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదిస్తే ఆర్టికల్ 31 బీ కింద 9వ షెడ్యూల్లో నోటిఫికేషన్ వస్తుంది. అగో అప్పుడు దానికి సంపూర్ణ చట్టబద్ధత వస్తుంది. దీన్ని ఏ కోర్టులూ కొట్టివేయజాలవు. ఉదాహరణకు.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోండి. ఈ రిజర్వేషన్ల లిమిట్ దాటిందని చేస్తున్న వాదనలు తప్పు. వీటికి ఆర్టికల్ 38, 46 కింద రాజ్యాంగ సవరణ అయింది. ఆర్టికల్ 15(6), 16(6) సవరణతో 50 శాతం దాటింది. రాజ్యాంగ సవరణ అయితే దానికి ప్రొటెక్షన్ వస్తుంది.
ఆర్డినెన్స్‌కు, కులగణనకు రాజ్యాంగ భద్రత ఏమేరకు ఉంటది?
ఇప్పుడైతే ఆ బిల్లు వట్టి చెత్త కాగితం. వీళ్లు తెస్తామంటున్న ఆర్డినెన్స్ అంతకు మించి డొల్ల కాగితం. 342ఏ కింద సవరించిన రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులాల జనాభాను నిర్ధారించుకొనే హక్కు ఉన్నది. 342 ఏ (3) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసుకొని ఓబీసీలను గుర్తించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆర్టికల్ 242 డీ (6), 242 టీ (6) కింద బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ కులాల తరహాలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కావాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి. కానీ అంతకంటే ముందు రాజ్యాంగపరంగా ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా! కుల గణన చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ చేశారు.
అందులో ఎవరు ఎక్స్పర్ట్? వాళ్లు ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు ఏం పరిశీలిస్తున్నారు? పోస్టుమార్టం చేస్తున్నారా? సర్వే రిపోర్టు ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టారా? సర్వే కమిషన్ వేశారా? సింపుల్ విషయం.. ఈ రోజు ఆర్డినెన్స్ తీసిండ్రు. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకుంటం అని చెప్తున్నరు. ఎస్సీ, ఎస్టీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేస్తామని చెప్తున్నరు. మొత్తం కలిపితే 67 శాతం అమలు చేస్తామంటున్నారు. 2018 పంచాయతీ ఎన్నికలప్పుడు కేసీఆర్ 34 శాతం అమలుకు ప్రయత్నం చేశారు. పైగా ఆయన బీసీలకు అంత ఇస్తం, ఇంత ఇస్తం అని హామీలేమీ ఇవ్వలేదు. అయినా ఓ ప్రయత్నం చేసిండు. హైకోర్టు కుదరదు అంటే వెనక్కి వచ్చిండు. కుదరదు.. చట్టం ముందు నిలవదు అని హైకోర్టు చెప్పిన విషయాన్నే ‘రెడ్డొచ్చే మొదలాయే’ అన్నట్టు రేవంత్‌రెడ్డి భూజానికి ఎత్తుకున్నడు. దీన్ని చారిత్రక నిర్ణ యం అని, రాహుల్ గాంధీ ఆశయమని గొప్పలకు పోతున్నారు. కానీ గౌరవ కోర్టుల్లో ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. ఒక్క అడ్వకేట్ జనరల్ కాదు.. పది మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చి వాదించినా కేసు నిలబడదు.. దేశ వ్యాప్తంగా పేరు మోసిన న్యాయవాదులంతా వచ్చి వాదించినా రేవంత్‌రెడ్డి తెచ్చిన ఆర్డినెన్స్‌ను కోర్టులు అంగీకరించవు. ఇట్లా అసంబద్ధంగా చట్టం చేసిన ఏ చట్టం నిలువదు.
రిజర్వేషన్ల పరిమితికి కొలమానం ఏమిటి?
1992 కాన్ట్సిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం పంచాయతీల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తామని రాజ్యాంగ సవరణ జరిగింది. దాని ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద, వెనుకబడిన కులాలకు మాత్రం రాష్ర్టాల వారీగా చట్టం చేసి ఎడక్విట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆర్టికల్ 242 డీ(6) ప్రకారం పంచాయతీల్లో, ఆర్టికల్ టీ(6) ప్రకారం మున్సిపాలిటీ లోకల్‌బాడీస్‌లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగ సవరణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పటి నుంచి 2018 వరకు అవి అమలయ్యాయి. ఈ సమయంలోనే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇంద్రాసాహ్నీ కేసుల్లో విద్య, ఉద్యోగాల్లో మాత్రమే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటకూడదని కొన్ని కీలకమైన తీర్పులు వచ్చాయి. ఈ తీర్పులే కొలమానం.
బీహార్‌లో రాజ్యాంగబద్ధంగా వెళ్లినా హైకోర్టు ఎందుకు అభ్యంతరం చెప్పింది?
బీహార్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్‌నే ఫాలో అయింది. సమగ్ర కులగణన చేసింది. సర్వే రిపోర్టును ప్రచురించింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకొని చట్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 65 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసింది. అయినా ఆ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రొసీజర్ అంతా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని అంగీకరిస్తూ 65 శాతం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని, 50 శాతం రిజర్వేషన్ పరిమితికి మించింది కాబట్టి దాన్ని అన్ కాన్ట్సిట్యూషనల్గా డిక్లేర్ చేస్తూ రిజర్వేషన్లను కొట్టి వేసింది. దీని మీద బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్తే ధర్మాసనం స్టే ఆర్డర్ ఇవ్వలేదు. మేం కూడా ఈ కేసులో అప్పీల్ వేశాం.. ఇప్పటికీ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
రిజర్వేషన్ల అమలులో డెడికేటెడ్ కమిషన్ పాత్ర ఏంటి?
ఆ కమిటీ కేవలం రిజర్వేషన్ నిర్ణయించడానికే. సర్వే రిపోర్టు వస్తే దాన్ని పరిశీలించి ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు? పరిస్థితి ఎలా ఉన్నది? ఎలా రిజర్వేషన్ల నిష్పత్తి పెట్టాలనేది మాత్రమే వాళ్లు చెప్తారు. ఈ డెడికేటెడ్ కమిషన్ నాకు తెలిసి కేవలం పోస్టుమార్టం మాత్రమే చేసింది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలున్నాయి? ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని జడ్పీ, ఎంపీటీసీ స్థానాలు, కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి? ఎక్కడ ఎవరి జనాభా ఎంతున్నది? ఆ జనాభా ప్రాతిపదికన 50 శాతం లోబడి మాత్రమే రిజర్వేషన్లను నిర్ణయించేందుకే డెడికేటెడ్ కమిటీకి అధికారం ఉన్నది. అది కులగణన చేయడానికి కాదు.
ప్రతిపక్షాలు సహకరించాలని ఓ మంత్రి అంటున్నారు?
నేను కూడా విన్నా. ఏ రకంగా సహకరించాలి? వెనుబడిన జాతులకు సంక్రమించిన రాజ్యాంగబద్ధమైన హక్కులను త్యాగం చేయాలా? వంచించి మోసం చేస్తుంటే కడుపు చించుకోకుండా చేతులు కట్టుకొని నిలబడాలా? మీరు ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నా కోర్టులకు వెళ్లకుండా ఆగాలా? బీసీలకు ప్రతిపక్షాలు సాయం చేయవద్దని కోరుతున్నారా? ఆర్డినెన్స్ తీసుకురావల్సిన అవసరం ఏమున్నది? ఉభయ సభలను స్తంభింపజేసి, సభలను ఇప్పుడు సమావేశ పర్చలేమని చెప్పడం దారుణం. ఈడబ్ల్యూఎస్ సవరణ బిల్లు రెండు, మూడు రోజుల్లో పాసైంది. మీరు సమావేశాలు పెడితే చర్చ జరుగుతుంది కదా? లీగల్ ఎక్స్పర్ట్స్ రిపోర్టులు ఇస్తారుకదా? ప్రతిపక్షం మాట్లాడుతుంది కదా? ఇలాంటిది ఏమీ చేయకుండా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరడం ఏ రకమైన భావన అది.
ప్రశాంతంగా ఉండే మీరు ఇంత ఆవేశపడుతున్నారు?
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను దగా చేశారు. నిట్ట నిలువునా వంచించారు. అధికారం వచ్చిన తర్వాత ఏడాదిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్‌రెడ్డి 9 నెలలు నిమ్మలంగా ఉన్నాడు. తీరా సమయం ముంచుకొచ్చిన తర్వాత డ్రామాలు చేస్తున్నారు. బీసీలను మభ్య పెట్టేందుకు కులగణన డిక్లేర్ చేశారు. చేసిన దాన్ని చట్టం చేయకుండా ఆ బాధ్యతలు ఎవరికో అప్పగించారు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు ఇస్తానన్నది. అలాంటిది కూడా చేయలేదు. ప్లానింగ్ కమిషన్‌కు సంపూర్ణంగా ఇవ్వలేదు. ఏదీ లేకుండా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు ప్రకటించడమంటే బీసీలను వంచించడం, మోసం, దగా చేయడం కాకుంటే ఇంకేమవుతది?
బీసీలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలి. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఇతర ఏ పార్టీలకూ బీసీలంటే చిత్తశుద్ధి లేదు. బీసీల సంక్షేమం కోరేవారు ఆ పార్టీల్లో లేరు. కాంగ్రెస్‌లో 75 నామినేటెడ్ పోస్టుల్లో 53 అగ్రకులాలకు ఇచ్చారు. వారిలో మెజార్టీ రెడ్లు ఉన్నారు. మిగతావి ఇతర కులాలకు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో కూడా బీసీలు అర్హులు కారా? అంటే ఈ ప్రభుత్వం బీసీలను అంత చిన్నచూపు చూస్తున్నదా? బీసీలు ఇప్పటికైనా కండ్లు తెరిచి.. మన హక్కును మనం కాపాడుకోవడానికి ఉద్యమించా లి. న్యాయపోరాటాలకు సిద్ధం కావాలి. రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి అఖిలపక్షం ఏర్పాటు చేసే పరిస్థితులను కల్పించాలి. మనందరి ఒత్తిడి వల్ల కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో కలిపేందుకు ప్రయత్నం చేస్తే విజయం సా ధిస్తాం. బీసీల పట్ల తమకు చిత్తిశుద్ధి ఉన్నదని నిరూపించుకోవడానికి నిరాహార దీక్ష చేయాలి. అందులో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, స్థానిక బీజేపీ ఎంపీలు కూర్చోవాలి.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నమేంటి?
1994 నుంచి 2018 వరకు అమలైన 34 శాతం బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వం నిలుపుకొనేందుకు ప్రయత్నం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చి బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 396 జారీ చేసింది. స్థానిక సంస్థలన్నింటిలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సంకల్పించింది. కానీ హైకోర్టు అడ్డుపడ్డది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. రిజర్వేషన్ల మీద కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. సుప్రీంకోర్టు ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వెనకి తీసుకుని, ఆర్డినెన్స్ 2/2018 జారీ చేసి 50 శాతం రిజర్వేషన్ పరిమితికి లోబడి బీసీలకు దాదాపు 22 శాతం రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికలకు వెళ్లింది.
దీంతో బీసీ రిజర్వేషన్లు 33 శాతం నుంచి 22 శాతానికి పడిపోయాయి. ఆ రోజున కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. బీసీలకు ఆ 22 శాతం రిజర్వేషన్లు కూడా దక్కవు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరీ లోతుగా వద్దు గానీ సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యే తరహాలో తాజా ఉదాహరణలు కొన్ని చెప్తా. ఒడిశా ప్రభుత్వం నిరుడు ఓటరు జాబితా ఆధారంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించింది. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధమంటూ ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు 21 శాతం మినహా మిగతా అన్ని స్థానాలను జనరల్‌గా మార్చి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలోనూ ఇదే తరహాలో జరిగింది. 2022 నుంచి ఇప్పటికీ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. తెలంగాణలో ఇప్పుడు ఇలాంటి ప్రమాదమే పొంచి ఉన్నది.