హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ చెప్పారు. కోర్టుల్లో మౌలిక వసతులు, మానవ వనరులు, సాంకేతికత కల్పనకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. అన్ని కోర్టులు ఒకేతీరులో ఉండేందుకు వీలుగా ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో కొత్త కోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1053 కోట్లు మంజూరు చేసిందని, మిగిలిన జిల్లాల్లో కోర్టుల నిర్మాణానికి రూ.891 కోట్ల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నదని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రధాన భవనంపై ఆయన జాతీయ జెండాను ఆవిషరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఏడాదిలో 210 రోజులు కోర్టు పనిచేస్తే 74,468 కేసులు దాఖలయ్యాయని, 72,414 కేసులు పరిషారమయ్యాయని వివరించారు.
సుప్రీంకోర్టు తీర్పులు 3,500, రెండు వేలకుపైగా హైకోర్టు తీర్పులు తెలుగులో అనువాదం చేయించినట్టు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన నాలుగు జాతీయ లోక్‌అదాలత్‌లలో 55.20 లక్షల కేసులు పరిషారమయ్యాయని, వాటిలో 28.73 లక్షలు క్రిమినల్, 10,793 సివిల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసుల్లో రూ.236.44 కోట్లు కక్షిదారులకు అందజేసినట్టు చెప్పారు. తెలంగాణ బాధితుల పరిహార చట్టం కింద పోక్సో, యాసిడ్ దాడులు, మహిళలు, తదితర బాధితులకు, వారి కుటుంబసభ్యులకు 179 కేసుల్లో రూ.5.90 కోట్లు పరిహారం అందిందని తెలిపారు. 40 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా 672 కేసుల పరిషారమయ్యాయని వెల్లడించారు.
జైలులో డీఅడిక్షన్, లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయని, 49 మంది సివిల్ జడ్జీ పోస్టుల నియామకం, కింది కోర్టుల్లో 1,461 మంది సిబ్బంది, హైకోర్టు రిజిస్ట్రీలో 212 పోస్టుల భర్తీ జరిగిందని చెప్పారు. మారుమూలన ఉన్న వ్యక్తికి కూడా సత్వర న్యాయం అందించి న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని చీఫ్ జస్టిస్ పేరొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు ప్రసంగించారు. న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్, పదో తరగతిలో ప్రతిభ కనబరచిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు ప్రధాన న్యాయమూర్తి ద్వారా హైకోర్టు మాజీ ఉద్యోగి విరూపాక్షరెడ్డి అవార్డులను అందజేశారు.