Krishna Tribunal | హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేసీ కెనాల్ నీటి వినియోగాల గణాంకాలను పరిశీలిస్తే.. కేటాయింపులకు మించి వినియోగాలున్నాయని, అయినప్పటికీ అక్కడ షరతులు విధించకుండా, కేవలం జూరాల ప్రాజెక్టు వద్దనే నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఎందుకని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ట్రిబ్యునల్‌లో ప్రశ్నలు లేవనెత్తారు. కేసీ కెనాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరిన్ని నీళ్లు వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ విధమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ప్రతిపాదించారని వాదించారు. దీనిపై ఏపీ తరపున సాక్షి అనిల్‌కుమార్ స్పందిస్తూ ట్రిబ్యునల్ 1కే8, కే9 సబ్బేసిన్ల మీద విధించిన ఆంక్షలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నానని బదులిచ్చారు.
కేసీ కెనాల్ ప్రాజెక్టు సక్సెస్ రేట్‌ను అధ్యయనం చేయలేదని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణాజలాలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయడంతోపాటు ప్రాజెక్టులవారీగా కేటాయింపులకు సంబంధించిన జస్టీస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో మూడవ రోజైన శుక్రవారం కొనసాగింది. ఏపీ తరపున ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ప్రతిపాదించిన చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్ గోయెల్‌ను తెలంగాణ తరపున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కేసీ కెనాల్, వైకుంఠపురం, పులిచింతల ప్రాజెక్టులకు సంబంధించి నీటివాటాల పంపిణీ, నీటివినియోగం తదితర అంశాలపై గోయెల్ తన అఫిడవిట్లో ప్రతిపాదించిన అంశాలపై ప్రశ్నించారు.
కేసీకెనాల్తోపాటు ఇతర ప్రాజెక్టుల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను ఆపరేట్ చేయాలని చెప్పడానికి ప్రాతిపదిక ఏమిటని వైద్యనాథన్ ప్రశ్నించారు. అయితే కేవలం ఏపీ అధికారులతో జరిపిన చర్చల ఆధారంగానే ఆ ప్రతిపాదనలు చేసినట్టు అనిల్‌కుమార్ గోయెల్ వెల్లడించారు. కేసీ కెనాల్ ప్రాజెక్టు సక్సెస్ రేట్‌ను అధ్యయనం చేశారా? అని ప్రశ్నించగా, అదేమీ లేదని బదులిచ్చారు.
పులిచింతల ప్రాజెక్టు ఇరు రాష్ర్టాల మధ్య సరిహద్దుగా ఉన్నదని, ప్రాజెక్టు కింద ఉన్న 95% ఆయకట్టు ఏపీదేనని, అదీగాక సాగర్ దిగువన క్యాచ్మెంట్ ఏరియా నుంచే 53టీఎంసీల మేరకు జలాలు పులిచింతలకు వచ్చి చేరుతాయని, అలాంటప్పుడు కేడీఎస్ (కృష్ణా డెల్టా సిస్టమ్)కు శ్రీశైలం, సాగర్ నుంచి జలాలు ఎందుకని వైద్యనాథన్ ప్రశ్నించారు. సమాధానం చెప్పలేనని ఏపీ తరపు సాక్షి అనిల్‌కుమార్ గోయెల్ దాటవేశారు. వైకుంఠపురం ప్రాజెక్టుపైనా అదేతరహాలోనే సమాధానమిచ్చారు. తదుపరి విచారణను డిసెంబర్ 4, 5తేదీలకు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ వాయిదా వేశారు.
హైదరాబాద్, నవంబర్8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన రూల్‌కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ఖరారు చేసేందుకు ఏర్పాటుచేసిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని యథాప్రకారం కొనసాగించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. అందుకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించేందుకు ఎజెండాను కూడా ఇరు రాష్ర్టాలకు ప్రతిపాదించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆర్ఎంసీ సమావేశాన్ని 25వ తేదీ తరువాతనే నిర్వహించాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. దీంతో సమావేశాన్ని బోర్డు సైతం వాయిదా వేసింది.