హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్లు అయిన లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పూర్తి అదనపు బాధ్యతలప్పగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నా యి. 25 ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, నాలుగు నెలల క్రితం నియమితులైన వారికి ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు అప్పగించడమేంటని కొందరు లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొందరు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు రిటైర్ అయ్యారు.
వారి స్థానంలో ఓ మూడు కాలేజీలకు నాలుగు నెలల క్రితం విధుల్లో చేరిన జేఎల్‌కు ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు అప్పగించేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. దీనిని క్రమబద్ధీకరించిన జేఎల్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమపై ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నిస్తున్నారు. 20-25 ఏండ్లుగా పనిచేస్తున్నప్పటికీ తమను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడంలేదని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం ప్రశ్నించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారుల వింత నిర్ణయాలు విస్తుగొలుపుతున్నాయి. జూనియర్ కాలేజీల్లోని లెక్చరర్లకు ఆన్లైన్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టాలంటూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో శిక్షణనిస్తామన్నారు. సెబీ, ఎస్ఐఎస్ఎం, పీఎఫ్ఆర్డీ, ఎన్సీఎఫీ వంటి వాటిపై డాక్టర్ సారిక లోహనా అవగాహన కల్పిస్తారని ఉత్తర్వులిచ్చారు. అయితే ఇది సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని అధ్యాపక సంఘాలంటున్నాయి.