చిక్కడపల్లి, డిసెంబర్ 10 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. పెన్షన్ను 6 వేలకు పెంచేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద దివ్యాంగులు మహాధర్నా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జూలకంటి మాట్లాడారు. రాష్ట్రం లో 43.02లక్షల మంది దివ్యాంగులుంటే అసరా పెన్షన్ 5.17 లక్షల మందికే వస్తున్నదని పేర్కొన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు వెంకట్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి అడివయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు సాయిబాబా, ఎన్పీఆర్డీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.