న్యూఢిల్లీ : లోక్‌సభలో విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రధాని మోదీ(PM Modi) చేయాల్సిన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సందర్భంలో ప్రధాని మోదీ ప్రసంగం చేయాల్సి ఉండగా. విపక్ష ఎంపీలు అధికార పక్ష కుర్చీల్లో నిలబడి నిరసన తెలిపారు. అయితే ఇవాళ కూడా లోక్‌సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో గురువారం లోక్‌సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రెండు వర్గాల మధ్య నినాదాలు హోరెత్తడంతో.. స్పీకర్ బిర్లా సభను వాయిదా వేశారు.
అయితే లోక్‌సభలో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని స్కిప్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్పే అవకాశం లేనట్లు కనిపిస్తున్నది. అయితే ఆయన రాజ్యసభలో తన ప్రసంగాన్ని చేయనున్నారు. రాజ్యసభలో పెద్దగా ఆందోళనలు జరగడం లేదు కాబట్టి .. ఎగువ సభలో ప్రధాని తన ధన్యవాద తీర్మానాన్ని తెలిపే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకే రోజు రెండు సభల్లోనూ ధన్యవాద తీర్మానాన్ని పాస్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడవలసి ఉన్న ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. 8 మంది విపక్ష ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేయడం, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకి చెందిన అముద్రిత పుస్తకం నుంచి చైనాకు సంబంధించిన కొన్ని అంశాలను ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌సహా విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం లోక్‌సభలో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.