Vanchanagiri Road | ఖిలావరంగల్, ఫిబ్రవరి 5: అది నిత్యం వేల మంది ప్రయాణించే రహదారి.. కానీ నేడు ఆ దారి మృత్యుపాశంలా మారింది. గీసుకొండ మండలం వంచనగిరి నుంచి ఖిలావరంగల్ మండలం స్తంభంపల్లి వరకు గల సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు అధ్వానంగా తయారై ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. రెండేళ్ల క్రితం కంకర వేసి వదిలేయడంతో, ప్రస్తుతం ఆ రహదారిపై రాళ్లు తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగెం, చింతలపల్లి, శాయంపేట, వంచనగిరి, స్తంభంపల్లి తదితర గ్రామాల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు నిత్యం ఖిలా వరంగల్ మీదుగా ఈ రోడ్డునే ఆశ్రయిస్తుంటారు. రోజూ వేలాది మంది బైకులు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే రోడ్డుపై కంకర తేలిపోయి ఉండటంతో ద్విచక్రవాహనాలు0 స్కిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది గాయాలపాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
అలాగే కంకర మీద ద్విచక్ర వాహనాలు వెళ్లినప్పుడు టైర్లు డ్యామేజ్ అయి కొన్ని కొన్ని సార్లు పంచరవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. పంచర్ జరిగితే అతికించడానికి 5 కిలోమీటర్ల వరకు పంచర్ షాపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు భారీ వాహనాలు వెళ్లే సమయంలో కంకర రాళ్లు ఎగిరి పక్కన నడిచే వ్యక్తులకు తగిలి గాయాలు కావడం సాధారణమైపోయింది. రోడ్డుపై దుమ్ము ధూళి కూడా ఎక్కువగా ఉండటంతో ప్రయాణం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.
పట్టించుకోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు..
ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అధికార యంత్రాంగం ఈ సమస్యను పూర్తిగా విస్మరించిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. రెండేళ్లు గడిచినా రోడ్డు మరమ్మతులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ప్రయాణ మార్గం కావడం వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. అధికారులు కనీసం పరిశీలనకు కూడా రావడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని వంచనగిరి, స్తంభంపల్లి సహా పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా