దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం సింగరాయిపేట గ్రామానికి చెందిన కోట్నాక బోజ్జిరావు అనే
గిరిజన యువకుడిని పాత కేసుల నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో గ్రామస్తులు అటవీ రేంజ్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ముందు బైఠాయించారు. ముందస్తు సమాచారం లేకుండా ఉదయం ఐదు గంటలకు అరెస్టు చేయడంపై గ్రామానికి చెందిన గిరిజనులు మండిపడ్డారు.
అక్రమంగా అదుపులోకి తీసుకోవడం తగదని,ఎలాంటి ఆధారాలు లేకుండా అదుపులోకి తీసుకుని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్న గిరిజన యువకుడిని వదిలిపెట్టేదాకా ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఈ విషయమై ఎఫ్ఆర్ఓ సుష్మారావును వివరణ కోరగా.. గతంలో సింగరాయిపేట బీట్ 344 కంపార్ట్మెంట్లో 8 చెట్లు కొట్టాడని, అదేవిధంగా విధుల్లో ఉన్న అటవీ అధికారులపై దాడులకు పాల్పడ్డాడని, ఆ కారణం చేతనే అతనిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తానిమడుగుకు చెందిన కోడి సుధాకర్‌ను కూడా పాత కేసుల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.