సిరిసిల్ల గాంధీ చౌక్, డిసెంబర్ 31: పర్యావరణానికి, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాను పతంగులకు ఉపయోగించవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా దారంపై అవగాహన కల్పించే పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి ప్రభుత్వం నిషేధించిన మాంజా దారాలను ఎవరూ ఉపయోగించవద్దని తెలిపారు.
మాంజా దారం చెట్లకు చుట్టుకొని పక్షులకు తీవ్రహాని కలిగే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. నిషేధిత మాంజాలు అమ్మినా, వినియోగించినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధికా జైశ్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జీలు ప్రవీణ్, మేఘన, ఏఎస్పీ చంద్రయ్య, డీఈవో జగన్మోహన్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, కార్యదర్శి వెంకటి, లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.