Food Festival | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : వరుస ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలైన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడింది. దీంట్లో భాగంగా ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్’ పేరుతో బడుల్లో కొత్త కార్యక్రమానికి తెరతీసింది. 21న నిర్వహించే పేరెంట్ టీచర్ సమావేశంను ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్’ థీమ్‌తో నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. పాయిజన్ ఘటనలతో రాష్ట్రప్రభుత్వం అప్రతిష్ఠ మూటగట్టుకుంది. 55 పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూశాయి.
సర్కారు స్కూళ్లల్లో 383, కేజీబీవీల్లో 168 మంది అస్వస్థతకు గురై దవాఖానల పాలయ్యారు. నారాయణపేట జిల్లా మాగనూరులో 10 రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యింది. మన బడిలో ఆహారోత్సవం పేరుతో పౌష్టికాహారంపై దృష్టిసారించాలని సూచించింది. సర్వపిండి, సకినాలు, నువ్వుల/రాగిలడ్డు, మక్క గారెలు, ఆకుకూరలు, వంటి ఆహారపదార్థాలను తయారుచేసేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించింది. వీటిని ఎలా తయారుచేయాలో సూచించే పోస్టర్‌ను తల్లిదండ్రులకు అందజేయాలని సూచించింది.
ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలోని బీసీ బాలికల గురుకుల హాస్టల్లో గత నెలలో పదోతరగతి విద్యార్థినిని ఎలుకలు కొరకగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హాస్టల్ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించకుండా ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులతోపాటు పలు పనుల నిమిత్తం వచ్చిన వారిని లోనికి అనుమతించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కుమార్తె అనారోగ్యంతో ఉన్నదని, కలిసి వెళ్లేందుకు వచ్చామని పలువురు వేడుకున్నా పేరెంట్స్‌కు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చిచెప్పారు.
అయినప్పటికీ తల్లిదండ్రులు గంటలకొద్దీ గేటు వద్దే నిరీక్షించారు. ఎంతో దూరం నుంచి ఎన్నో ఆశలతో హాస్టల్లో తమ పిల్లలను కలిసేందుకు వచ్చిన పేరెంట్స్ పోలీసుల చర్యలతో నిరుత్సాహంతో వెనుదిరిగారు. అంతేగాక హాస్టల్లో బాలికపై ఎలుకల దాడి ఘటన జరిగిన విషయం తెలుసుకునేందుకు వచ్చిన పలు విద్యార్థి సంఘాలను సైతం అనుమతించలేదు. హాస్టలో విచారణ జరుగుతున్నదని, అనుమతి లేదంటూ సీఐ ఉస్మాన్ షరీఫ్ అక్కడికి వచ్చిన పేరెంట్స్తోపాటు విద్యార్థి సంఘాలకు తేల్చిచెప్పారు.
గురుకుల ప్రిన్సిపాల్, విద్యార్థినులను కలిసి వివరాల సేకరణ ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ బాలికల గురుకుల హాస్టల్లో టెన్త్ విద్యార్థిని లక్ష్మీభవాని కీర్తిపై జరిగిన ఎలుకల దాడి ఘటనపై ఖమ్మం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖర్‌రావు బుధవారం విచారణ చేపట్టారు. హాస్టల్‌ను సందర్శించిన ఆయన సుమారు రెండు గంటలపాటు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు విద్యార్థినులను స్వయంగా కలిసి వివరాలు తెలుసుకున్నట్టు తెలిసింది. అనంతరం ఖమ్మం మమత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థిని ఆయన పరామర్శించారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.