హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మిస్ ఇంగ్లండ్ వివాదం కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేస్తున్నది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీని అధికార పార్టీకి చెందిన నాయకులు వేధించినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని మొన్నటివరకు ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తే.. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీలోని ఓ వర్గం దీనిని వాడుకుంటున్నది. మ్యాగీని వేధించినట్టు ఆరోపణలున్న ఇద్దరు నేతలకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వవద్దని వారి ప్రత్యర్థి వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే మిస్ ఇంగ్లండ్ వివాదాన్ని సొంత పార్టీనేతలే లేవనెత్తడంపై అధిష్ఠానం సైతం బిత్తరపోయినట్టు తెలిసింది.
మిస్ ఇంగ్లండ్ వివాదంతో చెక్..!
ముఖ్య నేత ప్రోద్బలంతో ఓ యువ నాయకుడు జూబ్లీహిల్స్ టికెట్ కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దల ఆశీస్సులు తనకున్నాయని.. టికెట్ తనకే వస్తుందని.. ఓ ప్రత్యేక కోటాలోనూ తాను ముందుంటానని పార్టీ నేతలతో చెప్పుకొంటున్నారు. ఇదే టికెట్‌పై కన్నేసిన మరో సీనియర్ నాయకుడు సైతం ఢిల్లీ వరకు లాబీయింగ్ నడపుతున్నాడు. దీంతో పార్టీలోని మరో వర్గం మిస్ ఇంగ్లండ్ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. వీరిద్దరికి చెక్ పెట్టి ఆ టికెట్‌ను తాము దక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలకు పదునుపెట్టారు. ము ఖ్య నేత మద్దతున్న యువ నేత, సీనియర్ నాయకుడి కొడుకు మిస్ ఇంగ్లండ్‌ను వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయని, వీరికి టికె ట్ ఇస్తే సర్వత్రా వమర్శలు వస్తాయని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.