హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 17 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌లో ఆరని కుంపట్లను రగిల్చాయి. బీఆర్ఎస్తో పోటీ దేవుడెరుగు.. పార్టీలోనే అంతర్యుద్ధం జరుగుతున్నదని శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సీఎం వర్గం, మరోవైపు స్థానిక నేతలు, ఇంకోవైపు సీనియర్ నేతల మధ్య పోరుతో నియోజకవర్గం కలగాపులగంలా తయారైందని పే ర్కొంటున్నారు. తమ అభ్యర్థికే టికెట్ దక్కాల ని సీఎం వర్గం పావులు కదుపుతుంటే, సీనియర్ నేత అంజన్‌కుమార్‌యాదవ్ తానే పోటీ చేస్తున్నానని ప్రకటించుకుంటున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా ఢిల్లీ నుంచి నరుక్కొస్తున్నారన్న ప్రచారం ఉన్నది. మిగతా ఆశావహులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభివృద్ధి-సంక్షేమం అంటూ అందరినీ కలుపుకుని పోయి ప్రచారం చేస్తుంటుంది. కానీ జూబ్లీహిల్స్‌లో మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి వర్గం ఒంటెత్తు పోకడ పోతున్నదని, అడ్డుగా ఉన్న నేతలను వ్యూహాత్మకంగా ఒక్కొక్కరినీ తప్పిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నా రు. ఆయనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా అభ్యర్థిని ప్రకటించే వరకు ఆయనను కలుపుకొనిపోయి ప్రచారం చేయాల్సి ఉండగా, అం దుకు భిన్నంగా అజార్‌కు సమాచారం ఇవ్వకుండానే సీఎం వర్గం ప్రచారం మొదలుపెట్టిందని చర్చ జరుగుతున్నది.
అజార్‌తో మొదటి నుంచీ విబేధాలు ఉన్న ఓ మంత్రి పావులు కదపడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌సీఏ వివాదాన్ని పార్టీకి ముడిపెట్టిన మంత్రి, అజార్‌కు టికెట్ దక్కకుండా ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. దీంతో అజార్ నేరుగా హస్తినకు వెళ్లి సోనియా, రాహుల్‌ను కలవడంతో సీఎం వర్గం వ్యూహం మార్చిందని సమాచారం. ఆయన్ని బరిలో నుంచి తప్పించేందుకు ఎమ్మెల్సీ పదవిని తెరమీదికి తెచ్చారని ఓ సీనియర్ నేత విశ్లేషించారు.
నియోజవర్గంలో తమ అభ్యర్థికి ప్రధాన పోటీదారుగా ఉన్న అజార్‌ను తప్పించడంతో.. ఇతర ఆశావహులను కూడా నిరాశపరిచేందుకు సీఎం వర్గం కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ‘స్థానికుడికే టికెట్’ అనే ప్రకటన చేశారని అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపిక నిర్ణయం ఏఐసీసీదే. స్థానికుడా? స్థానికేతరుడా? ఎవరిని బరిలో దించాలన్నది ఢిల్లీలో నిర్ణయం అవుతుంది. కానీ దానికి భిన్నంగా మంత్రి పొన్నం వ్యాఖ్యలు చేయడంతో ఊహించని ప్రతిఘట న ఎదురైంది. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తెర మీదకు వచ్చి, గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘నేను పారాచ్యూట్ నేతను కాను’ అని స్పష్టంచేశారు. పొన్నం కంటే తానే సీనియర్‌నని అటు సీఎం వర్గానికి, ఇటు మంత్రికి ఒకేసారి కౌంటర్లతో ఝలక్ ఇచ్చారని నేతలు చెప్తున్నారు. స్థానికులకే టికెట్ అనే ప్రకటన బెడిసికొట్టడం, ఒక్కసారిగా విభేదాలు భగ్గుమనడంతో సీఎం రేవంత్ దిద్దుబాటు చర్యలకు ది గారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే 14న గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీదేనని ప్రకటించారని చెప్తున్నారు.
అయినా అంజన్‌కుమార్ యాదవ్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు అధిష్ఠానం నుంచి నరుక్కొస్తూనే, మరోవైపు క్షేత్రస్థాయిలో ఎటాక్ చేస్తున్నారు. ఇటీవలే పోస్టర్లు వేసి తాను వెనక్కి తగ్గనన్న సంకేతాలిచ్చిన ఆయన, బుధవారం కూడా పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో తాను పోటీ చేసేది పక్కా! అని స్పష్టం చేశారు. దీంతో అజార్నైతే పక్కకు తప్పించాంగానీ అంజన్‌ను ఎలా తప్పించాలనే దానిపై సీఎం వర్గం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా నేరుగా అధిష్ఠానం నేతలను కలిసేందుకు వెళ్లినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం వర్గం ఒక వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేయించేందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదనే నిర్ణయానికి దానం వచ్చినట్టు తెలిసింది. అందుకే నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోనే టచ్‌లోకి వెళ్లినట్టు స్పష్టమవుతుం ది. రెండు, మూడు రోజులుగా దానం బెంగళూరులోనే మకాం వేసి ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్టు చెప్తున్నారు. మరికొందరు స్థానిక నేతలు సైతం రాష్ట్ర, జాతీయ పార్టీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.