Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. యూసుఫ్‌గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్ల విషయంలో నిలదీసిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే సాయంత్రం 5 గంటల సమయం వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ దాదాపు 50 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.