Jubilee Hills By Election | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By Election) ఫలితాలు (Results) శుక్రవారం వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాసర్‌రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్నది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించనున్నారు. సాధారణంగా ఓట్ల లెకింపునకు 14 టేబుల్స్ ఏర్పాటుచేస్తారు. అయితే, ఈసారి ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని 42 టేబుల్స్ ఏర్పాటుచేస్తున్నారు. దీంతో 10 రౌండ్లలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానున్నది.
186 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇందులో కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ సూపర్‌వైజర్‌తోపాటు ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఇతరులకు అనుమతి లేదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.