హైదరాబాద్, నవంబర్13 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేతల్లో (Congress) ఆందోళన పెరుగుతున్నది. సైలెంట్ ఓటింగ్ అధికార పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నది. ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి ఇంటింటికీ పంచినా, వాహనాల్లో పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లినా ఎవరు ఎటువైపు ఓటు వేశారో స్పష్టత లేకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా ఈ ఉపఎన్నికలో రూ.300 కోట్లు ఖర్చు చేసినా ఓటర్లు అధికార పార్టీకి పట్టపగలే చుక్కలు చూపించినట్టు ఎగ్జిట్‌పోల్ సర్వేలు తేల్చి చెప్పాయి. దొంగఓట్లు, దొంగ ఓటర్లతోపాటు రౌడీమూకలతో పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేసి రిగ్గింగ్‌కు పాల్పడినా అంతిమ ఫలితం చేజారి పోయినట్టేననే అనుమానం కాంగ్రెస్ పార్టీ నేతలను నిద్రపోనివ్వడంలేదని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. రెండేండ్ల విధ్వంసక పాలనకు, పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధికి మధ్య హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సైలెంట్ ఓటింగే నిర్ణయాత్మక శక్తిగా నిలిచిందని ఎగ్జిట్‌పోల్స్ అంచనావేయడంతో అధికార పార్టీలో కాక రేపుతున్నది. ఇంతటి ఉత్కంఠ నేపథ్యంలో శుక్రవారం జరుగనున్న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పంచిన నోట్లు, వేయించిన దొంగ ఓట్ల ఆధారంగా లెక్కలుగట్టిన అధికార పార్టీ గెలుపు ధీమాతో కనిపించింది. వారి అంచనాకు తగ్గట్టు ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో కొన్ని సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించాయి. దీంతో ఆ పార్టీ నేతలు పోలింగ్ జరిగిన రోజు రాత్రి గెలిచినంత సంబురపడిపోయారు. కానీ, మరుసటి రోజు బూత్‌ల వారీగా పంచిన చీరలు, ఇచ్చిన నగదు, పోల్ అయిన ఓట్ల శాతం గణించి డీలా పడ్డారట. ఏడు డివిజన్లలో కలిపి లక్షన్నర చీరలు పంపిణీ చేయగా, దాదాపు 91 వేల మంది మహిళలు మాత్రమే వచ్చి ఓట్లు వేశారని పోలింగ్ ఏజెంట్లు నిర్ధారించినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయిందని ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలో మొత్తం 1,91,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 50% మంది మహాలక్ష్మి పథకానికి అర్హులు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు రూ.2,500 చొప్పున ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పింది. ఈ ఎన్నికల్లో 48% మంది మహిళలు ఓటు వేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వీరు చీరలు, నగదు తీసుకున్నా ఓటు మాత్రం సైలెంట్‌గా కారు గుర్తుకే వేసి ఉంటారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని ఏడు డివిజన్లలో కలిపి ఆరు వేల మంది వృద్ధులు పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 70% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తున్నది. అధికార పార్టీ ఇంటింటికీ తిరిగి రూ.5 వేల చొప్పున డబ్బులు ఇచ్చి ప్రమాణం చేయించుకున్నట్టు చెప్తున్నారు. అయినా, బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన బాకీకార్డు ప్రభావం వృద్ధుల మీద బాగానే పనిచేసినట్టు కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఎగ్గొట్టిన కాంగ్రెస్ మీద అవ్వాతాతలు కోపంతో ఉన్నారు. ఓటుహక్కు వినియోగించుకున్న ప్రతి 10 మంది వృద్ధుల్లో 8 ఓట్లు కారు గుర్తు మీదనే పడినట్టు ఎగ్జిట్‌పోల్స్ చెప్తున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మహిళలు, వృద్ధుల ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీళ్ల ఓట్లలో మెజారిటీ వాటా బీఆర్ఎస్కే బదిలీ అయ్యాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక యువత సంగతి సరేసరి. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత నష్టపోయామో గుర్తుంచుకొని ఓట్లు వేయాలని పోలింగ్ డే రోజు యువత పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికితోడు బీఆర్ఎస్ పంచిన బాకీకార్డులతో తామేం కోల్పోయామో వారికి అర్థమైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విచక్షణ కలిగిన యువ ఓటర్లు బీఆర్ఎస్కే మొగ్గు చూపి ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా రెండేండ్ల పాలనకు శుక్రవారం వెల్లడయ్యే ఫలితాలు నిలువుటద్దంగా నిలుస్తాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
పోలింగ్‌కు ముందు జరిగిన ప్రీ పోల్ సర్వేల్లో కారు టాప్ గేర్ మీద పరుగులు తీసింది. దాదాపు 80% సర్వేలు కారుదే విజయమని అంచనా వేశాయి. సర్వే ఫలితాల నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన అధికార పార్టీ భయపడి ఓటర్లను మభ్యపట్టే పనిలో పడిందని ఆరోపణలు ఉన్నాయి. మైనారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆగమేఘాల మీద మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పిలిచి మంత్రి పదవి కట్టబెట్టారు. పోటీ చేసిన అభ్యర్థి ఆస్థులు కుదవబెట్టి రూ.300 కోట్లు తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రతి ఓటుకు రూ.5 వేల చొప్పున లెక్కగట్టి ఇంటింటికీ పంచిపెట్టిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రతి మహిళకు ఒక చీర చొప్పున లక్షన్నర చీరలు కొనుగోలు చేసి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన దాదాపు 20 వేల మంది ఓటర్ల జాబితాను గుర్తించి, వారి పేర్ల పేద నకిలీ గుర్తింపుకార్డులు ముద్రించారని, రాజేంద్రనగర్, కార్వాన్ నియోజకవర్గాలతోపాటు బీదర్, గుల్బర్గా ప్రాంతాల నుంచి 20 వేల మంది మహిళలను రప్పించి దొంగఓట్లు వేయించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కైసర్ మొయినుద్దీన్ దాదాపు 3,500 మంది మహిళలను తన నియోజకవర్గం నుంచి రప్పించి షేక్‌పేట డివిజన్లో దొంగ ఓట్లు వేయించినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.