హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: రాష్ట్రంలో జర్నలిస్టులను విభజించేలా తీసుకొచ్చిన జీవో 252ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన యూనియన్ ప్రతినిధులు, జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకొని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలిపి, ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా, ఇంతవరకు జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో అన్ని యూనియన్లను కలుపుకొని 23 వేల అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. జర్నలిస్టులు 13 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారని, ఇది గుర్తించే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులంటూ విభజించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల విషయంలో మీడియా అకాడమీ ప్రస్తుత చైర్మన్ గతంలో వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. జర్నలిస్టులుగా హక్కుల కోసం పోరాడుతుంటే మీడియా అకాడమీ చైర్మన్ రాజకీయాలు ఆపాదించడం శోచనీయమన్నారు. తన హయాంలో మీడియా అకాడమీ చైర్మన్‌గా రూ. 42కోట్ల నిధులు తీసుకొచ్చానని, కొత్త భవనం నిర్మించానని, కొవిడ్ సమయంలో రూ. 7కోట్లు జర్నలిస్టులకు కేసీఆర్ ద్వారా ఇప్పించానని గుర్తుచేశారు. జర్నలిస్టులు సాధించుకున్న హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి లాక్కునే ప్రయత్నం చేయొద్దని కోరారు. జీవో 252 ద్వారా 14వేల మంది జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం, సమాచార శాఖ మంత్రి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులందరికీ ఒకే రకమైన కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల అరెస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 252 జీవోను నిరసిస్తూ పలు జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాయి. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఖండించాయి. ఈమేరకు శాంతియుత నిరసన తెలిపేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసుల తీరు నిరసిస్తూ జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల నిధికి రూ.42 కోట్లు కేటాయించి జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల కు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. జీవో 252ను తక్షణమే ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యోగానంద్, జిల్లా నేతలు యార నవీన్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, సోమేశ్, వర్దె ల్లి బాపురావు, టీపీజేఏ అధ్యక్షుడు జీ భాస్క ర్, చిన్నయాదగిరిగౌడ్ పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులను విభజించొద్దు

హైదరాబాద్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): వర్కింగ్ జర్నలిస్టులను అక్రెడిటేషన్లు, మీడియా కార్డుల పేరిట విభజించొద్దని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) డిమాండ్ చేసింది. డెస్క్ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ రెండు కార్డుల విధానం ద్వారా జర్నలిస్టులను విభజించడం సరికాదని మండిపడ్డారు. జీవో నంబర్ 252ను సవరించాలని, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్స్, వెబ్, కల్చరల్, బిజినెస్, కార్టునిస్టులకు గతంలో ఇచ్చినట్టే అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కదిరవన్‌కు వినతి పత్రం అందజేశారు. కాగా డీజేఎఫ్టీ ఆందోళనకు వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మస్తాన్, ఉపాధ్యక్షుడు కేవీ రాజారాం, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సానుకూల స్పందన
జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్టు డీజేఎఫ్టీ తెలిపింది. శనివారం మహబూబాబాద్‌లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కలిసి డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల అంశం దృష్టికి తీసుకెళ్లగా, న్యాయం జరిగేలా చూస్తామని హామీని ఇచ్చినట్టు పేర్కొంది.