మహబూబ్‌నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆందోళన చేస్తారని విపక్షాలు, ప్రజాసంఘాలను అదుపులోకి తీసుకోవడం పరిపాటి. కానీ తొలిసారిగా జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ ముందస్తు అరెస్టులకు దిగారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ‘నమస్తే’ విలేకరులను కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పేర్లు, అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు రాసుకుని సంతకాలు తీసుకున్నారు. మొత్తం 12 మంది రిపోర్టర్లను ముందస్తు అరెస్టు చేయడం రాష్ట్రంలో తొలిసారి సీఎం సొంత జిల్లాలో చోటుచేసుకున్నది. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో రిపోర్టర్లను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ‘నమస్తే’ విలేకరులను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ‘నమస్తే తెలంగాణ’ ఆర్సీ ఇన్చార్జి సీపీ నాయుడు ఇంటికి వెళ్లిన పోలీసులు ఎస్సై పిలుస్తున్నారంటూ బయటికి తీసుకొచ్చారు. తమకు మాకు పాస్ ఉంది.. సీఎం ప్రోగ్రాం కవరేజ్‌కి వెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. ఎస్సీ కాలనీలో ఉంటున్న రూరల్ రిపోర్టర్ స్వాములను కూడా స్టేషన్‌కు తరలించారు. పెంట్లవెల్లి మండల విలేకరి రమణను అదుపులోకి తీసుకొన్నారు. కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల విలేకరుల ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ వాళ్లు లేకపోవడంతో స్టేషన్‌కు రమ్మనాలని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లారు. తొమ్మిది మంది విలేకరులను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నేతలను కూడా ముందస్తు అరెస్ట్ చేసి ఠాణాకు తీసుకెళ్లారు. కొల్లాపూర్‌లో జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 143, ఐజేయూ, ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కూలి ఇస్తామని.. కూడైనా పెట్టలేదు! ; ఆకలితో అలమటించిన చిన్నారులు
కొల్లాపూర్, జూలై 18 : నాగర్‌కర్నూల్ జిల్లా జటప్రోల్లో శుక్రవారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి సభకు వచ్చిన కొందరు చిన్నారి కళాకారులు అసహనం వ్యక్తంచేశారు. తమకు కూలి ఇస్తామని మీటింగ్‌కు తీసుకొచ్చి కనీసం భోజనం కూడా పెట్టించలేదని వాపోయారు. పట్టణంలోని ఓ మొబైల్ క్యాంటీన్ వద్ద ఆకలి తీర్చుకుంటున్న చిన్నారులు, మహిళలను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. సీఎం రేవంత్ బహిరంగ సభలో కోలాటం వేసేందుకు తమను పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి నుంచి నాయకులు తీసుకొచ్చారని తెలిపారు. మధ్యాహ్న భోజనం సంగతి దేవుడెరుగు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని వాపోయారు.