కామారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పట్టినట్టు నటిస్తాయి తప్ప గల్లీల్లో మాత్రం దోస్తులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం బాన్సువాడలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆందోళన చేయడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి.. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని తెలిపారు. ఇది గిట్టని ఈ రెండు పార్టీల నాయకులు.. స్పీకర్‌పై బురద జల్లడమే ధ్యేయంగా ఉమ్మడిగా ఆందోళన చేస్తున్నారని దుయ్యబట్టారు.
సోమవారం బాన్సువాడ దవాఖాన వద్ద జరిగిన చిన్న ఘటనను భూతద్దంలో చూపిస్తూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళన చేయడంపై జనం దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేస్తూ, బాన్సువాడలోని ప్రభుత్వ దవాఖాన, మాతా శిశు దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న వైద్యులకు వ్యతిరేకంగా రెండు పార్టీల నేతలు నిరసన తెలుపడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూడా ఈ రెండు పార్టీల నియోజకవర్గ స్థాయి నేతలు కలిసి మున్సిపాలిటీ ఎదుట పార్టీల జెండాలు పట్టుకొని ఆందోళన చేయడంతో స్థానికులు నవ్వుకున్నారు.