జగిత్యాల : దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తాం అవకాశం ఇవ్వండని అడగటం ఆ పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) మండిపడ్డారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దీకొండ, ల్యాగలమర్రి, నంచర్ల గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించాగా మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
నంచర్ల గ్రామానికి చెందిన బీజేపీ ఓసీబీ మోర్చా జిల్లా కార్యదర్శి హరిగోపాల్, కాంగ్రెస్ పార్టీ ఐదవ వార్డు సభ్యురాలు చేపూరి ఉమారాణి, 20 మంది కార్యకర్తలు మంత్రి కొప్పుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నంచర్ల గ్రామాలో మంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డది నిజం కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాలల్లో అధికారంలో ఉంది. అక్కడ రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ముందు అక్కడ అమలు చేసి తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు. ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.