సంగారెడ్డి : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని సదాశివపేటకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సదాశివపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలనేత్ర గౌడ్, సదాశివపేట బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో 100 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ప్రతి రంగంలో తెలంగాణ నంబవర్ రాష్ట్రంగా నిలుస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు తల్లడిల్లాయని, కరెంట్ లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు
మాయమాటలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. అభివృద్ధిని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటదన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.