హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వాయర్ భూనిర్వాసితులకు “భూసేకరణ చట్టం-2013” ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. పిప్పల్‌కోటి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల జీవనపరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. 2018లో ఎగువన “పిప్పల్‌కోటి రిజర్వాయర్’ కరకట్ట పనులను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
భూములు కో ల్పోయిన రైతులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందన్న ఆశతో వివిధ అవసరాలకు అప్పులు చేశారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం నేటికీ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలో అప్పులు తీర్చలేక ఇప్పటికే నలుగురు రైతులు మృతి చెందారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు.