ఇల్లంతకుంట రూరల్, మార్చి16 : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో పాటు, వారి నోట్లో మట్టికొట్టే విధంగా వ్యవహరిస్తోందని, రైతులు తిరగబడితే కాంగ్రెస్ సర్కారు గల్లంతవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ(John Wesley) ధ్వజమెత్తారు. రంగనాయకసాగర్ ఎల్ఎం6 కెనాల్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రిలేనిరాహారదీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అంతకు ముందు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ళు లేక రైతులు భూములను పడావుపెట్టి అడ్డామీది కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాల్వ కోసం రైతుల పోరాటం న్యాయమైందని, ఎల్ఎం 6 కెనాల్ తవ్వేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. కాల్వ నిర్మాణం కోసం కనీసం రూ.10 కోట్లు ఖర్చుపెట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదని, ఇంకా రూ.10 వేల కోట్లు మిగిలి ఉందని, రైతు భరోసా ఊసేలేదని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు. మహిళలకు రూ.2500లు, దళితులకు రూ.12లక్షల హామీ మట్టిలో కలిసిపోయిందని, 2 లక్షల ఉద్యోగాల ఇస్తామని ఇప్పటి వరకు చడీ చప్పుడు లేదన్నారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పతనం తప్పదని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్నదని, కాజీపేటలో రైల్వేకోచ్ ప్రాక్టరీ ఊసేలేదని, బయ్యారం ఉక్కుకర్మాగారంపై నోరుమెదపడం లేదని మండిపడ్డారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ర్టాలకు ఎంపీ సీట్లు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసేలా ఉందని, ఉత్తరాది రాష్ర్టాలకు ఎంపీ సీట్లు పెంచేలా మేలు చేస్తోందన్నారు. ఈ నెలాఖరు వరకు ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించకుంటే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు గన్నారం నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.