ఆదిలాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.2 లక్షల రుణమాఫీ(Loan waiver) విషయంలో అబద్ధాలు మాట్లాడుతూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డికి ఆయన మంగళవారం ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి, రాజ్యాగ పరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీ విషయంలో అబద్ధాలు ఆడుతున్నారని, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణం తీసుకోండి.. తాము అధికారంలోకి రాగానే డిసెంబరు 9న మాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి తన మాట మార్చారన్నారు. సీఎం హోదాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేవుళ్లపై ఒట్టు పెట్టుకుని ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ప్రమాణం చేశారని గుర్తు చేశారు. మొదట రూ.49 వేల కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించారని, తర్వాత రూ.40 వేల కోట్లు, తిరిగి రూ.31 వేల కోట్లు అని చెప్పి బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.
ఆగస్టు 15 నాటికి సీఎం రేవంత్‌రెడ్డి 22,22,067 మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించి ఇంకా రూ.19,77,933 మంది రైతులకు రూ.13,131 కోట్లు మాఫీ చేయాల్సి ఉందని ప్రకటిం చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో అక్టోబర్ 7, 2024 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ మూడు దశల్లో పూర్తిస్థాయిలో అమలు చేశామని ప్రకటించడం హస్యాస్పంగా ఉందన్నారు.