ఆదిలాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శనివారం ఆయన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆందోళనలు చేపడుతుందని అన్నారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటుతో రైతులను ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ నేతలను తిరగనివ్వబోని హెచ్చరించారు. రైతు భరోసా కింద ఎకరాకు 15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం ఇప్పుడు మాటతప్పి 12 వేలేనని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అచ్చంపేట టౌన్, జనవరి 11 : ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖాన ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు శనివారం నిరసన తెలిపారు. సంక్రాంతి పం డుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయని వాపోయారు. వెంటనే జీతాలు చెల్లించేలా సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.