రాష్ర్టానికి మరో ప్రఖ్యాత వస్త్ర కంపెనీ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో పేజ్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్ల దుస్తులు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణలో కంపెనీ మరింత అభివృద్ధి చెందాలి. జాకీ బ్రాండ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం
తరఫున గ్రాండ్ వెల్కం.
– మంత్రి కేటీఆర్
1994లో ఈ కంపెనీని జినోమల్ కుటుంబం స్థాపించింది. ఈ కుటుంబానికి అంతకుముందు యాభై ఏండ్లుగా జాకీ సంస్థతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌లో జినోమల్ కుటుంబానికి మాత్రమే జాకీ బ్రాండ్ లైసెన్స్ ఉన్నది. 2007లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో పేజ్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ అయింది. దాదాపు 20 వేల మంది కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భారత్‌లోని 1800 నగరాల్లో దాదాపు యాభై వేల రిటైల్ ఔట్లెట్ల ద్వారా జాకీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. జాకీ బ్రాండ్ సొంత అవుట్లెట్లు సుమారుగా 500 వరకు ఉన్నాయి. స్పీడో బ్రాండ్‌కు కూడా 189 నగరాల్లో దాదాపు 1035 స్టోర్లు ఉన్నాయి.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఉత్పాదక, ఆహారశుద్ధి పరిశ్రమల గమ్యస్థానంగా ఖ్యాతి గడించిన తెలంగాణ వస్త్ర ఉత్పత్తులకూ కేరాఫ్‌గా నిలువనున్నది. పెట్టుబడుల ఏర్పాటుకు అనువైన వాతావరణం, ప్రభుత్వ సానుకూల విధానాలతో దేశ, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. తాజాగా జాకీ బ్రాండ్‌తో ప్రఖ్యాతిగాంచిన దుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్.. రూ.290 కోట్లతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో దుస్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ పరిశ్రమల్లో స్పోర్ట్స్ వేర్, అథ్లెయిజర్వేర్ గార్మెంట్స్ తయారు చేయనుండగా, సుమారు 7 వేల మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వీ గణేశ్ నేతృత్వంలోని కంపెనీ బృందం బుధవారం ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను కేటీఆర్ వారికి వివరించారు.
పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా అద్భుతంగా ఉన్నదని, ఇందువల్లే తాము ముందుకొచ్చామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి చెప్పారు. ‘ఈ రెండు చోట్ల పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఏటా కోటి యూనిట్లు ఉత్పత్తి అవుతాయి. 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణలో కంపెనీ మరింత అభివృద్ధి చెందాలి. జాకీ బ్రాండ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రాండ్ వెల్కం’ అని సమావేశం అనంతరం కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారం వల్లే రెండు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ఎండీ గణేశ్ తెలిపారు. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఒమన్, ఖతర్, మాల్దీవులు, భూటాన్, యూఏఈ తదితర దేశాల్లో జాకీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నదని తెలిపారు. భారత ఉపఖండంతోపాటు ఇతర దేశాల్లో ప్రసిద్ధి చెందిన తమ కంపెనీ ఉత్పత్తుల తయారీకి తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొన్నామని చెప్పారు.
తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. భారత్‌లో పెద్దఎత్తున తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు భౌగోళికంగా అత్యంత అనుకూలమైన ప్రాంతం అని వివరించారు. ఇబ్రహీంపట్నంలో వైట్‌గోల్డ్ స్పింటెక్స్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, సిద్దిపేట జిల్లా ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమలను నెలకొల్పనున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం యూనిట్లో 3 వేల మందికి, ములుగు యూనిట్లో 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
బెంగళూరు కేంద్రంగా..
బెంగళూరు కేంద్రంగా వస్త్ర పరిశ్రమ కొనసాగిస్తున్న పేజ్ ఇండస్ట్రీస్, అమెరికాకు చెందిన జాకీ ఇంటర్నేషనల్ బ్రాండ్ పేరుతో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర ప్రాంతాల్లో వస్ర్తాల తయారీ, పంపిణీ, మార్కెటింగ్ నిర్వహిస్తున్నది. అలాగే స్పీడో బ్రాండ్ వస్ర్తాలను కూడా భారత్‌లో తయారు చేస్తున్నది.
సిరిసిల్లలో ఆదిత్య బిర్లా డిజైన్ స్టూడియో
మరమగ్గాల ద్వారా విభిన్న డిజైన్ల వస్ర్తాల తయారీకి ఖ్యాతిగాంచిన రాజన్న సిరిసిల్లలో వస్ర్తాల డిజైన్ స్టూడియో ఏర్పాటుకు ఆదిత్య బిర్లా గ్రూపు ముందుకొచ్చింది. అపారెల్ పార్క్‌కు అనుబంధంగా ఇది పనిచేయనున్నది. ఈ స్టూడియో ద్వారా కొత్త ట్రెండ్స్, వెరైటీ డిజైన్లు, మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజైన్లను రూపొందించి, వాటి తయారీని ప్రోత్సహిస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూపు తమిళనాడులోని తిరువూరులో డిజైన్ స్టూడియోను ఏర్పాటు చేసి, వస్ర్తాల మార్కెటింగ్‌కు దోహదపడుతున్నదని, ఇదే తరహాలో సిరిసిల్లలో స్టూడియో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.