హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అధికారులు ఎందుకు జాప్యాన్ని పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని బాధితుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. 393మంది క్రీడాకారుల నిర్ధారణకు తొమ్మిది నెలలా..? అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డీఎస్సీ-24 ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా బాధితుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ కుమారస్వామి శాట్స్, విద్యాశాఖ అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తుది లిస్టు కోసం శాట్స్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్, శాట్స్ అధికారులు రెండుగా చీలిపోయి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పును కప్పుపుచ్చుకునేందుకు దొంగ సర్టిఫికెట్లతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని అధికారులే కాపాడుతున్నారని ఆరోపించారు. శాట్స్ అధికారులు పంపించిన మూడు నివేదికలకు పొంతనలేదని పేర్కొన్నారు. జీఏడీ నుంచి స్పష్టత వచ్చినా ఇంకా తుది నియామకాల చేపట్టకుండా అక్రమార్కులను కాపాడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని అక్రమాలపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.