హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఫలితాలు సా ధించాలని, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు గిరిజన సంక్షేమ శాఖ అల్టిమేటం ఇచ్చిం ది. అందుకోసం కాంట్రాక్టు గురుకుల టీచర్ల (సీఆర్టీ) నుంచి ఒప్పంద పత్రాలు తీసుకుంటుంది. సీఆర్టీ ఉద్యోగాలు తొలిగించాలన్న కుట్రలతోనే ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటుందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు చావ రవి, ఏ వెంకట్ మండిపడ్డారు. 22 ఏండ్ల నుంచి గిరిజన సంక్షేమ శాఖలో నామమాత్రపు వేతనాలతో పని చేస్తున్న సీఆర్టీలకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఒప్పంద పత్రాలు తీసుకోవడం కోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. సీఆర్టీలను ఉద్యోగాల నుంచి తొలిగించాలనే కుట్రలు చేస్తే యూటీఎఫ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.