Minister Dayakar Rao | మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పథకాలను సైతం అమలు చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మహిళలకు రెండో విడత కుట్టు శిక్షణ ముగియగా.. వారికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల పక్షపాతి సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెండ్లికి భరోసా కల్పిస్తున్నామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ కుట్టు మిషన్ల శిక్షణను ఏర్పాటు చేశానన్నారు.
]రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ కుట్టు మిషన్ల శిక్షణను సీఎం కేసీఆర్ను ఒప్పించి పైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చినట్లు చెప్పారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో కుట్టు మిషన్ల శిక్షణను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రెండో విడత కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కుట్టు మిషన్ల శిక్షణ ఉపయోగపడుతుందని, మహిళలను అన్ని రంగాల్లో ముందు నిలిచేలా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మహిళలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని, మరోసారి ఆశీర్వదించాలన్నారు.