హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ క్యాలెండర్‌ను హడావుడిగా ప్రకటించి నిరుద్యోగ యువతను మోసం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జాబ్ క్యాలెండర్‌పై సభలో చర్చ జరపాలని కోరితే, కేవలం తేదీలు ప్రకటించి చేతులు దులుపుకొన్న సర్కార్‌కు యువత బుద్ధి చెప్తుందని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1.63 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంది బిడ్డను తమ బిడ్డ అని చెప్పుకొంటూ ఇచ్చిన 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలు కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఫలితాలు రెడీచేసి ఉంచినవే అని గుర్తుచేశారు.
ఎన్నికల ముందు ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని యువకులు, నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి రాగానే మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ నమ్మించిందని, ఎన్నికల్లో వారికి బస్సులిచ్చి ఊరూరా తిప్పి ప్రచారానికి వాడుకున్నదని, ఇప్పుడు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాటంతో ఆదరా బాదరాగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ఉద్యోగాల సంఖ్య చెప్పకపోవడం యువతను కాంగ్రెస్ నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. ఓట్ల కోసం యువతను వాడుకున్న రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఓయూకు వచ్చి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.